Home  »  News  »  Amaravathiki Aahvanam Review: అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ 

Updated : Feb 13, 2026

 

తారాగణం: శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తర్ నొరోన్హా, సుప్రిత, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు
డీఓపీ: జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
రచన, ద‌ర్శ‌క‌త్వం: జీవీకే
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కె.ఎస్. శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
విడుద‌ల‌ తేదీ: ఫిబ్రవరి 13, 2026

 

హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల కాలంలో టైటిల్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తర్ నొరోన్హా, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌ నిర్మించింది. నేడు(ఫిబ్రవరి 13) థియేటర్లలో అడుగుపెట్టిన 'అమరావతికి ఆహ్వానం' సినిమా ఎలా ఉందంటే..? (Amaravathiki Aahvanam Movie Review)

 

కథ:
ఈశ్వర్(శివ కంఠమనేని) సస్పెండ్ అయిన ఒక పోలీస్ అధికారి. భార్య భాను(ధ‌న్య బాల‌కృష్ణ‌), ఇద్దరు మరదళ్ళతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తుంటాడు. మరదలు భార్గవి(సుప్రీత) సిటీలోని భూత్ బంగ్లాలలో ఒకరోజు గడిపి అక్కడ దెయ్యం లేదని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది. ఒకసారి ఓ అజ్ఞాత వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి.. ఒక చోట నిజంగా దెయ్యాలు ఉన్నాయంటూ అమరావతి అనే ఊరికి ఆహ్వానిస్తాడు. ఇదొక ట్రిప్ లా ఉంటుందని భార్గవితో పాటు ఫ్యామిలీ కూడా వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈశ్వర్ కి ఇష్టం లేకపోయినా.. భార్య కోసం బయల్దేరతాడు. అమరావతిలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అక్కడ ఈశ్వర్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడికి వెళ్ళాక బయటపడిన రహస్యం ఏంటి? ఇందులో రాజేశ్వరి(ఎస్తర్ నొరోన్హా) పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:
హారర్ సినిమాలకు కథ కంటే కూడా కథనం కీలకం. ప్రేక్షకులను భయపెట్టేలా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి.. ఆసక్తికర కథనం, కట్టిపడే సన్నివేశాలతో థ్రిల్ ని పంచాలి. ఆ విషయంలో 'అమరావతికి ఆహ్వానం' బాగానే మెప్పించే ప్రయత్నం చేసింది.

అమరావతి ఊరికి మద్యం మత్తులో నలుగురు స్నేహితులు వెళ్ళడం, అక్కడ ఓ స్నేహితుడు వింతగా ప్రవర్తిస్తూ తనను తాను చంపుకునే సీన్ తో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈశ్వర్ కుటుంబాన్ని పరిచయం చేశారు. ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా నడిచినా, కథ ముందుకి వెళ్తున్న కొద్దీ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది.

అమరావతికి ప్రయాణం మొదలైన తర్వాత కథనంలో వేగం కనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే హారర్ సన్నివేశాలు మెప్పించాయి. ముఖ్యంగా ఒక పెద్ద గెస్ట్ హౌస్ కి వెళ్ళడం, అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురవ్వడం బాగుంది. రాజేశ్వరి పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ని డిజైన్ చేసిన తీరు మెస్మరైజ్ చేసింది.

ఈశ్వర్, రాజేశ్వరి పాత్రల మధ్య గతంలో ఏం జరిగింది అనే ఇంట్రెస్ట్ ని కలిగిస్తూ సెకండ్ హాఫ్ ని కూడా బాగా నడిపించారు. ఈ క్రమంలో వచ్చే మలుపులు ఆకట్టుకున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. అయితే ఫ్లాష్ బ్యాక్ నిడివిని తగ్గించి, సెకండ్ హాఫ్ లో హారర్ డోస్ పెంచితే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

దర్శకుడు జీవీకే హారర్ థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా సెటప్ బాగానే చేసుకున్నారు. అయితే రైటింగ్ పరంగా ఇంకా వర్క్ చేయాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ డైలాగ్స్ పెద్దగా పేలలేదు. అలాగే సెకండ్ హాఫ్ లో ఇంకా హారర్ ఎలిమెంట్స్ రాసుకొని ఉండాల్సింది.

హారర్ థ్రిల్లర్ జానర్ కి కెమెరా వర్క్, మ్యూజిక్ కీలకం. డీఓపీ జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి, సంగీత దర్శకుడు ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌ తమ పనితీరుతో పరవాలేదు అనిపించుకున్నారు. సాయిబాబు తలారి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. లొకేషన్స్ ఎంపిక కూడా బాగుంది. 

 

నటీనటుల పనితీరు:
ఈశ్వర్ పాత్రలో శివ కంఠమనేని చక్కగా ఒదిగిపోయారు. తెరపై హుందాగా కనిపిస్తూనే.. అవసరమైన చోట్ల సెటైర్లు వేయడం, రౌద్రరూపం చూపించడం చేశారు. రెండు కోణాల్లో ఆయన నటన మెప్పించింది. గృహిణిగా ధ‌న్య బాల‌కృష్ణ‌ ఆకట్టుకున్నారు . కొన్ని సన్నివేశాల్లో నట విశ్వరూపం చూపించారు. కథకు కీలకమైన రాజేశ్వరి పాత్రకు ఎస్తర్ నొరోన్హా పూర్తి న్యాయం చేశారు. సుప్రిత, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

ప్లస్ పాయింట్స్:
ప్రధాన తారాగణం నటన
హారర్ ఎలిమెంట్స్
ట్విస్ట్ లు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో హారర్ డోస్ తగ్గడం

 

ఫైనల్ గా..
అమరావతికి ఆహ్వానం.. హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి నచ్చే చిత్రం.

 

రేటింగ్: 2.75/5

 

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.