Home  »  News  »  కన్నీళ్లు ఆపుకోలేరు.. అయ్యగారిని హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చిన డైహార్ట్ ఫ్యాన్ నాగరాజు.!

Updated : Jul 16, 2026

తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానానికి అవధులు ఉండవు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుంటూరుకు చెందిన నాగరాజు. సోషల్ మీడియా వేదికగా "అయ్యగారే నెంబర్ వన్" అంటూ అక్కినేని అఖిల్ పై తనకున్న విపరీతమైన ప్రేమను చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన నాగరాజుకు ఒక అరుదైన, మరువలేని కల నిజమైంది. 

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఘన విజయం సాధించిన వేళ, బుధవారం గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ తన డైహార్ట్ ఫ్యాన్ ని ప్రత్యేకంగా కలిశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమాన హీరో కళ్లముందు కనిపించేసరికి నాగరాజు ఆనందాన్ని అస్సలు ఆపుకోలేకపోయాడు.

గుంటూరు నగరంలో రోడ్డుపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నాగరాజుకు సినిమా రంగంపై ఎలాంటి ఆశలు లేవు. కేవలం అఖిల్ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే అతను థియేటర్ల వద్ద విపరీతమైన హంగామా చేస్తూ కనిపిస్తుంటాడు. ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమా సమయంలోనూ థియేటర్ వద్ద నాగరాజు చేసిన హంగామా, అఖిల్ భారీ కటౌట్లకు పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం వంటి అభిమాన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. 

నాగరాజు చూపిస్తున్న ఈ నిస్వార్థమైన అభిమానం హీరో అఖిల్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఎంతో మురిసిపోయి, సమయం దొరికినప్పుడు నాగరాజును కచ్చితంగా కలుస్తానని గతంలో మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బుధవారం రాత్రి నాగరాజును ప్రత్యేకంగా పిలిపించుకున్నారు.

అఖిల్ ను కలిసిన ఆ సెకనులోనే నాగరాజు కళ్లల్లో ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి. తన అభిమాన చూసిన ఆనందంలో, హీరో ఎంత వద్దు అని వారిస్తున్నా వినకుండా అఖిల్ కాళ్లపై పడటానికి ప్రయత్నించాడు. ఆపై అఖిల్ అతడిని పైకి లేపి దగ్గరకు తీసుకోగా, నాగరాజు తన హీరోను గట్టిగా హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చేశాడు. "ఈ జన్మకు ఈ ఒక్క అదృష్టం చాలు అయ్యగారు" అంటూ నాగరాజు భావోద్వేగానికి గురైన తీరు అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఎమోషనల్ వీడియోను పంచుకోగా, అది క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

ప్రస్తుత రోజుల్లో ఒక హీరో అభిమానులు మరో హీరోపై ట్రోలింగ్స్ చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ కు దిగడం సర్వసాధారణం అయిపోయింది. కానీ నాగరాజు వీటన్నిటికీ పూర్తి దూరంగా ఉంటూ, కేవలం తన హీరోను మాత్రమే ఆరాధించే స్వచ్ఛమైన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో వచ్చిన డిజిటల్ క్రేజ్ ను వాడుకుని సులభంగా డబ్బు సంపాదించే పలు రకాల మార్గాలు ఉన్నప్పటికీ, పండ్ల వ్యాపారమే చేసుకుంటూ ఒక సాధారణ ఫ్యాన్ గానే మిగిలిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈ అరుదైన కలయికను చూసిన నెటిజన్లు "నిజమైన అభిమానికి దక్కిన గౌరవం ఇది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అఖిల్ చూపించిన ఈ పెద్ద మనసుకు అక్కినేని అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు.

https://x.com/AnnapurnaStdios/status/2077448897509917038

 

 

Lenin Movie, Akhil Akkineni, Ayyagare Number One, Guntur Nagaraju, Akhil Fan

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.