![]() |
![]() |
.webp)
సినిమా రంగంలో హీరోలుగా, హీరోయిన్లుగా రాణించాలని ఎంతో మంది ఆశ పడతారు. అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఆ క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దర్శకనిర్మాతలు కొత్తగా వచ్చే అమ్మాయిలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంటారనే వార్తలు అప్పుడప్పుడు వస్తుంటాయి. సినీ ప్రముఖుల వల్ల తమకు ఎలాంటి అన్యాయాలు జరిగాయి, ఎలాంటి లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నారు అనే విషయాలను కొంతమంది బయట పెట్టారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పిలిచే ఈ సమస్యపై ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మనం ఇప్పుడు వింటున్నాం. అయితే ఇది సావిత్రిగారి కాలం నుంచి ఉంది. ఎంతో మంది హీరోయిన్లు చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఆరోజుల్లో మీడియాగాని, సోషల్ మీడియాగానీ అందుబాటులో లేవు కాబట్టి ఆ విషయాలన్నీ బయటికి తెలిసేవి కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. అదే విధంగా అంతగా ఇంపార్టెన్స్ లేని చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి మీడియాలో చూపించేస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టుగా మీడియా పరిస్థితి తయారైంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నేను కూడా నా తొలిరోజుల్లో ఎదుర్కొన్నాను. అయితే పెద్ద సంస్థల్లో ఇలాంటివి అస్సలు జరగవు. కొత్త సంస్థల్లోనే జరుగుతుంటాయి. ఒక తమిళ్ సినిమాలో హీరోయిన్ అవకాశం ఉంది అంటే వెళ్ళాను. నాతోపాటు అమ్మ, తమ్ముడు కూడా ఉన్నారు. హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తాము. ‘మీకు తొడమీద ఏమైనా మచ్చ ఉందా’ అని అడిగారు. నేను షాక్ అయ్యాను. అక్కడ మచ్చ ఉండడం ఏమిటి అన్నాను. దానికాయన ‘ఇంతకు ముందు ఒక హీరోయిన్‌ని ఓకే చేసుకున్నాం. అయితే ఆమెకు అక్కడ మచ్చ ఉంది. మీకు కూడా ఉందేమోనని అడిగాం. ఒకసారి బట్టలు తీసేసి చూపించండి’ అన్నారు. దానికాయన ‘ఈ సినిమా టూ పీస్ డ్రెస్ వేసుకోవాలి, స్విమ్ చెయ్యాలి’ అని చెప్పారు. నేను ఆ క్యారెక్టర్ చెయ్యను అని చెప్పి వచ్చేశాను.
ఇలాంటి వాళ్ళు నిజంగానే సినిమా తియ్యడానికి వస్తారా అనే సందేహం కలిగేది. ఎందుకంటే అప్పటికే కొన్ని సినిమా ఆఫీసుల్లో పరిస్థితి చూసి ఉన్నాను కాబట్టి వెంటనే అర్థమయ్యేది. ఒక సినిమాలో నన్ను హీరోయిన్‌గా ఓకే చేసినపుడు నిర్మాత నుంచి ఫోన్ వచ్చింది. మేం బీచ్‌లో ఉన్నాము. మిమ్మల్ని మా ఫైనాన్సియర్ చూస్తాడట అన్నారు. నన్ను ఫైనాన్సియర్ చూడడం ఏమిటి అనుకున్నాను. దాంతో ఆ సినిమా కూడా వద్దనుకున్నాను. ఇలాంటి సిట్యుయేషన్స్ నా కెరీర్‌లో చాలా ఉన్నాయి. ఆ క్షణమే ఆ సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవకాశాల కోసం ఏదైనా చెయ్యడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు రాకపోతే రిటర్న్ వెళ్లిపోయి చదువుకుంటాను. ఉద్యోగం చేసుకుంటాను. కానీ, హీరోయిన్ అయిన తర్వాత ఎన్నో మంచి సంస్థలు తీసిన సినిమాల్లో నేను నటించాను. ఎంతో హెల్దీ వాతావరణంలో నా కెరీర్ సాగింది. ఆ విషయంలో నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి’ అంటూ తన కెరీర్‌లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి వివరించారు నటి ఆమని.
![]() |
![]() |