![]() |
![]() |

సీనియర్ నటులు ఎం. బాలయ్య మంచి నటుడు మాత్రమే కాదు మంచి రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో `ఊరికిచ్చిన మాట` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో చేసిన ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.. అప్పట్లో ప్రజాదరణ పొందడమే కాకుండా `తృతీయ ఉత్తమ చిత్రం`గా నంది పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు లేని ఊరి కోసం తన తమ్ముడ్ని డాక్టర్ చదివిస్తుంటాడు రాముడు (చిరంజీవి). ఆ ఊరి ప్రజలు కూడా తమ సంపాదనలో నెలనెలా పంపిస్తుంటారు. అయితే, పెద్దింటి అమ్మాయిని ప్రేమించిపెళ్ళాడిన తమ్ముడు.. మాట తప్పుతాడు. ఈ నేపథ్యంలో రాముడు తన తమ్ముడ్ని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు? ఊరికిచ్చిన మాటని ఎలా నిలబెట్టాడు? అనేది ఈ చిత్ర కథాంశం.
ఇందులో చిరంజీవికి తమ్ముడిగా సుధాకర్ నటించగా.. చిరుకి జంటగా కవిత, సుధాకర్ కి జోడీగా మాధవి అలరించారు. నారాయణరావు, కాంతారావు, గిరిబాబు, శ్రీలక్ష్మి, రావికొండలరావు, వంకాయల, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సి. నారాయణరెడ్డి, జాలాది సాహిత్యానికి ఎమ్మెస్ విశ్వనాథన్ వినసొంపైన బాణీలు అందించారు. అమృతా ఫిలింస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం.. తమిళంలో `ఊరుమ్ ఉరవమ్` (శివాజీ గణేశన్, కె.ఆర్. విజయ) పేరుతో రీమేక్ అయింది. 1981 జూన్ 24న విడుదలైన `ఊరికిచ్చిన మాట`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |