![]() |
![]() |

కొన్నిచిత్రాలకి ఎక్స్ పైరీ డేట్ ఉండదు. అలాంటి ఒక చిత్రమే నువ్వేకావాలి(Nuvve kaval). అక్టోబర్ 13 2000 వ సంవత్సరంలో థియేటర్స్ లో అడుగుపెట్టింది. స్నేహం, ప్రేమకి సరికొత్త అర్ధాన్ని చెప్పడంతో పాటు తెలుగునాట ఇదే కోవలో మరెన్నో చిత్రాలు తెరకెక్కడానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తరుణ్, రిచాల అద్భుతమైన పెర్ ఫార్మెన్స్, విజయ్ భాస్కర్(Vijay Bhaskar) దర్శకత్వం, త్రివిక్రమ్(Trivikram)సంభాషణలు, ఆకట్టుకొనే పాటలు, అభిరుచితో కూడిన నిర్మాణ సంస్థ పని తీరు ఇలా అన్ని ఒకదాన్ని మించి ఒకటి పోటీపడి 'నువ్వేకావాలి' ని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక దృశ్య కావ్యంలాగా మిగిలిపోయేలా చేసాయి. మూవీ ప్రదర్శిస్తున్న అన్నిరోజులు కాలేజీలలో హాజరు శాతం తక్కువ ఉండేదంటే కూడా నువ్వే కావాలి ప్రభంజనం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం నేటికీ రిలీజయ్యి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్(ushakiran Movies)తో కలిసి మరో అగ్ర నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్(Sravanthi Movies)నిర్మించింది. స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ మలయాళంలో 'నీరమ్' అనే చిత్రాన్ని చూసి ఆ సినిమా స్పూర్తితో తను కూడా నిర్మించాలని అనుకున్నాడు. కానీ తన ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో ఉషాకిరణ్ ని కలుపుకొని తెరకెక్కించాలని అనుకున్నారు . దీంతో నీరమ్ కథ నుంచి మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ తో స్కిప్ట్ ని రెడీ చేయించాడు. విజయ్ భాస్కర్ ఈ చిత్రం తర్వాత వెనుతిరిగి చూడలేదు. త్రివిక్రమ్ కూడా ఈ చిత్రానికి ముందు రెండు చిత్రాలు చేసినా, నువ్వే కావాలి తోనే స్టార్ డైలాగ్ రైటర్ గా మారిపోయాడు. తరుణ్(Tarun)ని ఈ చిత్రంలో మొదట హీరోగా అనుకోలేదు. మొదట అనుకున్న హీరో సుమంత్(Sumanth).ఆయన మరో చిత్రంతో బిజీగా ఉండటంతో తరుణ్ చేసాడు. పైగా తరుణ్ బాలనటుడిగా ఉషాకిరణ్ ద్వారానే పరిచయమయ్యాడు. హీరోగాను ఆ సంస్థ ద్వారానే పరిచయమవ్వడం యాదృచ్చికం. ఓవర్ నైట్ స్టార్ కూడా అయ్యాడు. హీరోయిన్ గా చేసిన రిచాసద్దా(Richa Pallod)గతంలో తరుణ్ తో కలిసి ఒక యాడ్ చెయ్యడంతో రిచాని ఎంపిక చేసారు. సునీల్ కి కమెడియన్ గా నువ్వే కావాలితోనే మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలోనే పాటలు ఎవర్ గ్రీన్. కోటి అందించిన సంగీతం యూత్ తో పాటు అందర్నీ మంత్ర ముగ్ధులు చేయడమే కాకుండా కోటి కెరీర్ కి మరో సారి మంచి ఊపుని ఇచ్చింది. ఆ రోజుల్లో ఈ చిత్రాల్లోని పాటలు లేకుండా ఏ కాలేజీ ఫంక్షన్ కూడా జరిగేది కాదు.
సుమారు కోటి ఇరవై లక్షలతో నిర్మాణం జరుపుకోగా 55 కోట్ల వరకు గ్రాస్ ని వసూలు చేసి నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి లాభాల పంట కురిపించింది. రన్నింగ్ పరంగా ముప్పై సెంటర్స్ లో వంద రోజులు, ఇరవై ఐదు సెంటర్స్ లో నూట డెబ్భై ఐదు రోజులు ఇరవై సెంటర్స్ లో రెండు వందల రోజులు ,పది సెంటర్స్ లో రెండు వందల యాభై రోజులు, ఆరు సెంటర్స్ లో మూడువందల అరవై ఐదు రోజులు ఆడి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సరికొత్త సవాలు విసిరింది. నైజాం ఏరియాకి సంబంధించి ఏడు కోట్ల రూపాయిల షేర్ దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. వందవ రోజున ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్ లో అభిమానులు భారీగా తరలి రావడంతో మూడు థియేటర్స్ లో షో లు ప్రదర్శించడం అప్పట్లో ఒక రికార్డు. హిందీలో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డుని కూడా గెలుచుకుపోవడంతో పాటు తరుణ్, విజయ్ భాస్కర్, రిచా, గాయకుడు శ్రీరామ్ ప్రభు కి ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది.
![]() |
![]() |