![]() |
![]() |

`చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ఉదయ్ కిరణ్.. ఆపై `కలుసుకోవాలని`తోనూ చెప్పుకోదగ్గ విజయం అందుకున్నారు. ఇవన్నీ కూడా రొమాంటిక్ డ్రామాలుగానే తెరకెక్కాయి. అయితే, ఉదయ్ ఐదో సినిమాగా వచ్చిన `శ్రీరామ్` మాత్రం.. అందుకు భిన్నంగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది.
`నువ్వు నేను` వంటి సంచలన చిత్రం తరువాత కథానాయిక అనితతోనూ, `మనసంతా నువ్వే` వంటి ఘనవిజయం అనంతరం దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతోనూ ఉదయ్ కిరణ్ జట్టుకట్టిన ఈ చిత్రం.. తమిళ సినిమా `దిల్` (విక్రమ్, లైలా)కి రీమేక్ గా తయారైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే శ్రీరామ్ అనే యువకుడిగా అలరించారు ఉదయ్. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, ఆశిష్ విద్యార్ధి, శివ కృష్ణ, సుధ, పరుచూరి వెంకటేశ్వర రావు, దీపా వెంకట్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ ఎంటర్టైన్ చేయగా.. కిరణ్ రాథోడ్ ఓ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేసింది.
ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో.. ``బుల్లి బుల్లి``, ``చిన్న చిరునవ్వుతోటి``,``తీయ తీయని``, ``పెదవుల్లో పెప్సీ కోల``, ``మోనాలిసా``, ``మామారే`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. బూరుగపల్లి శివరామ కృష్ణ నిర్మించిన `శ్రీరామ్`.. 2002 జూన్ 21న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేటితో ఈ చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |