Home » Movie Reviews » రాకాస



Facebook Twitter Google


నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎడురోలు రాజు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం: అనుదీప్ దేవ్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్
బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
సమర్పణ: జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం: మానసశర్మ
విడుదల తేదీ: 03.04.2026
సినిమా నిడివి: 133 నిమిషాలు

ఒక సినిమాను నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్లడమే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్. సినిమా ఎలా ఉన్నా, దానికి హైప్ తీసుకొచ్చి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే స్ట్రాట‌జీ. దాన్నే ఫాలో అయింది ‘రాకాస’ చిత్ర యూనిట్. అన్ని మాధ్యమాల్లో సినిమా గురించి ప్ర‌మోట్ చేసి ఏప్రిల్ 3న ‘రాకాస’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాల‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ మానసశర్మ రూపొందించిన ఈ సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. హారర్ కామెడీగా ప్రమోషన్స్‌లో ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం.

కథ: 

ఇది 1000 క్రితం మొదలైన కథ. రాజుల కాలం నుంచి ఆ ఊరి చివర కోటలో ఉన్న భీకర బ్రహ్మరాక్షసుడికి నరబలి ఇవ్వ‌డం అనేది ఆచారంగా వస్తూ ఉంటుంది. కోటలో ఉన్న రాక్షసుడి నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగా పంపిస్తుంటారు. బలి ఇవ్వకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందనే మూడనమ్మకంతో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంటారు. ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడనే భయంతో ఎవరూ ఆ కోట వైపు వెళ్లరు.

వెయ్యేళ్ల తరువాత 2026లో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి వస్తాడు. రకరకాల మలుపుల తర్వాత రాక్ష‌సుడికి బలిగా వెళ్లేందుకు సిద్ధపడతాడు వీరబాబు. కోటలోకి వెళ్లిన వీరబాబు బయటికి వచ్చే అవకాశం ఉండదు. అదే కోటలో వెన్నెల కిషోర్ కొన్నిరోజులుగా ఉంటూ ఉంటాడు. వీరబాబును వెతుక్కుంటూ హీరోయిన్, గెటప్ శ్రీను కూడా కోటలోకి వెళతారు. కానీ, బయటికి వచ్చే అవకాశం లేదు. రాక్షసుడ్ని చంపితేనే అక్కడి నుంచి వారంతా బయట పడగలరు. మరి వీరబాబు ఏం చేశాడు? చివరికి రాక్షసుడు హతమయ్యాడా? వీరబాబు బృందం బయటపడిందా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 



ఎనాలసిస్ :

ఓపెనింగ్ సీన్ చూస్తే సినిమాలో చాలా పెద్ద స్టఫ్ ఉంది అనిపిస్తుంది. 1000 ఏళ్ళ క్రితం కథతో మొదలై 2026లో హీరో ఎంటర్ కావడంతో పంచ్ డైలాగులతో కూడిన కామెడీ సినిమాగా మారిపోతుంది. అయితే ఇది హారర్ కామెడీ సినిమా అని గుర్తు చెయ్యడానికి అన్నట్టుగా కోట, రాక్షసుడికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని మధ్య మధ్య చూపిస్తుంటారు. ఏదో చందమామ కథని చూస్తున్న ఫీల్ కలిగించి, వీరబాబులోని ఫన్ ఎలిమెంట్స్‌ని వాడుకుంటూ కథని బాగా నడిపించారు దర్శకురాలు మానస.

కథలో, కథనంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా నడపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఎంతో బిల్డప్‌తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత కామెడీ వైపు టర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీపైనే నడుస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్తుంది. ఇక క్లయిమాక్స్‌లో చిన్న‌పాటి ట్విస్ట్‌తో, సెకండ్ పార్ట్ లీడ్‌తో సుఖాంత‌మ‌వుతుంది. అలాగే క్లయిమాక్స్‌లో వచ్చే ప్రమోషనల్ సాంగ్ కూడా బాగుంది. 

నటీనటులు:

సినిమాకి మెయిన్ ఎస్సెట్‌గా హీరో సంగీత్ శోభన్‌ని చెప్ప్పుకోవాలి. చక్కని టైమింగ్‌లో పంచ్ డైలాగులు కొడుతూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. అతనికితోడు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ నయన్ సారిక తన లుక్‌తో, అవసరమైన చోట పెర్‌ఫార్మ్ చేస్తూ ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి నటులు తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణులు:

టెక్నికల్‌గా ఈ సినిమా గురించి చెప్ప్పుకోవాలంటే ఎడురోలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్‌గా బాగానే ఉంది. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలుగా ఉండడం విశేషం. అనుదీప్ దేవ్ సంగీతం ఫర్వాలేదు అనిపించింది. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నట్టు కనిపించింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. డైరెక్టర్ మానసశర్మ గురించి చెప్పాలంటే.. కాస్త క్లిష్టంగా ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అక్కడక్కడా కనిపించే కొన్ని మైనస్‌లు తప్ప డైరెక్టర్‌గా ఓకే అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన మేరకు రాజీ పడకుండా సినిమాను నిర్మించారని ఔట్‌పుట్ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయంలో నిర్మాత నిహారిక కొణిదెలను అప్రిషియేట్ చెయ్యాలి.  

ప్లస్ పాయింట్స్:

సంగీత్ శోభన్ పెర్‌ఫార్మెన్స్
పంచ్ డైలాగ్స్
కొంత వరకు గ్రాఫిక్స్
పిల్లల్ని ఆకట్టుకునే అంశాలు
ప్రమోషనల్ సాంగ్

మైనస్ పాయింట్స్:

కథ, కథనాల్లో కేర్ తీసుకుంటే బాగుండేది
ప్రధాన ఇతివత్తంలోనే లోపాలు



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్ష‌కులు మంచి ఎంటర్‌టైన్‌మెంట్, పిల్లల్ని ఆకట్టుకునే కొన్ని అంశాలతో శాటిస్‌ఫై అవుతారు. 

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.