నటీనటులు: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి, సంజన, అవినాష్ రఘుదేవన్
సాంకేతిక వర్గం:
రచన: అరుణ్ మాదేశ్వరన్, ఫ్రాంక్లిన్ జాకబ్, అరుణ్ రంజన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ): ముఖేష్ జి
కూర్పు (ఎడిటింగ్): ప్రసన్న జి.కె
దర్శకత్వం: అరుణ్ మాదేశ్వరన్
నిర్మాణం: కళానిధి మారన్
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటనపై ఉన్న ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు డిసి (DC) చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారారు. రాఖీ, కెప్టెన్ మిల్లర్ లాంటి చిత్రాలు తీసిన అరుణ్ మాదేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
తన తల్లిని దారుణంగా చంపిన మేనమామలను హత్య చేసి జైలుకు వెళ్లిన దేవదాస్ (లోకేష్ కనగరాజ్), బయటికొచ్చాక తన తండ్రికి దూరంగా ఉంటాడు. పోలీసు ఆఫీసర్‌గా ఉండి నక్సలైట్‌గా మారిన అరసు గ్యాంగ్‌లో చేరుతాడు. ఆయుధాల కోసం పోలీసు వాహనంపై దాడి చేసినప్పుడు, పోలీసులు చేసే అరాచకాలు అతనికి తెలుస్తాయి. న్యాయం కోసం ఆ అవినీతి పోలీస్ అధికారిని చంపాలని నిర్ణయించుకుంటాడు, కానీ దాని వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ తోనే యుద్ధం చేయాల్సి వస్తుంది.
ఈ క్రమంలో బార్ సింగర్ పార్వతి (Sanjana)తో ప్రేమలో పడతాడు. వారి బంధానికి భవిష్యత్తు లేదని తెలిసినా ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. దురదృష్టవశాత్తూ, అతని కోసం వెతుకుతున్న పోలీసులు పార్వతిని చంపేస్తారు. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దేవదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన బార్ ఓనర్‌ను చంపే క్రమంలో, చంద్ర (Wamiqa Gabbi) అనే వేశ్యతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా కథ.
నటుడిగా లోకేష్ కనగరాజ్ తనను తాను నిరూపించుకున్నాడు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చాలా సహజంగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదనిపించినా, యాక్షన్‌లో ఉన్నంత ఈజ్ ఎమోషన్స్‌లో లేదు. వామికా గబ్బి తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది, అయితే కొన్ని డైలాగుల దగ్గర కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. పార్వతి పాత్రకు సంజన సరిగ్గా సరిపోయింది, లోకేష్‌తో ఆమె కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ మేకింగ్ స్టైల్, ఫ్రేమింగ్ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే స్క్రీన్‌ప్లేలో కొన్ని పాత ఐడియాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడమే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిలియంట్ గా తీశాడు. పార్వతి ట్రాక్ ను విజువల్ గా అద్భుతంగా చూపించాడు. కానీ క్లాసిక్ 'దేవదాస్' కథను బానీ అండ్ క్లైడ్ తరహా ప్రపంచంలో చూపించాలన్న అతని ప్రయత్నానికి, ఊహకందే స్క్రీన్‌ప్లే పెద్ద మైనస్ అయింది.
సెకండ్ హాఫ్ లో కథ ముందుకు సాగేకొద్దీ కొత్తదనం లోపించింది. కొన్ని ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికి దర్శకుడు అనవసరమైన సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. దర్శకుడి విజన్ కు తగ్గట్టుగా అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. క్లాసికల్, వెస్ట్రన్ మ్యూజిక్ ను మిక్స్ చేసిన విధానం సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగున్నా, కొన్ని ఫ్రేమ్స్ ఇంకాస్త టైట్ గా ఉంటే బాగుండేది.
ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని షాట్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్ గా ఈ యాక్షన్ ప్యాక్డ్ 'దేవదాస్' ఒక మోస్తరుగా ఆకట్టుకుంటుంది కానీ, అందరికీ నచ్చకపోవచ్చు. తెరపై రక్తపాతం, వైలెన్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. అధికారం ఎలా దుర్వినియోగం అవుతుందో, తిరుగుబాటును ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో చూపిస్తూ, పాత దేవదాస్ కథకు ఇచ్చిన కొత్త ముగింపు బాగుంది.
ప్లస్ పాయింట్స్:
అనిరుధ్ రవిచందర్ సంగీతం
లోకేష్ కనగరాజ్ నటన
సంజన స్క్రీన్ ప్రెజెన్స్
కొన్ని యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్‌లో సాగదీత
కొన్ని సన్నివేశాల్లో ఆశించిన స్థాయి ఎమోషన్ లేకపోవడం
ప్రీ-క్లైమాక్స్ కి ముందు గందరగోళం
రిపీట్ అయిన సీన్స్, నెమ్మదించిన కథనం
'డిసి' యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే ఒక డీసెంట్ మూవీ.
డిస్‌క్లెయిమర్: ఈ రివ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాం.