![]() |
![]() |

మహీకా శర్మ.. మోడల్ గా కెరీర్ సార్ట్ చేసి బాలీవుడ్ లో పలు చిత్రాల్లో చేసింది. ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మహీకా గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2025 సెప్టెంబర్‌లో మహీకా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో హార్దిక్ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాతి నెలలోనే అంటే 2025 అక్టోబర్‌లో ఈ జంట ముంబై విమానాశ్రయంలో తొలిసారిగా కలిసి కనిపిస్తూ తమ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి తరచుగా తమ ఫొటోలు, వీడియోలని పంచుకుంటున్నారు. ఇటీవలి ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ మహీకా స్టేడియంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఈ జంటకి సంబంధించిన ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఆధారంగా హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆ ఫొటోలో మహీకా శర్మ సాంప్రదాయ రీతీలో సిందూరం, నుదుటిపై ఎర్రటి బొట్టు కనిపిస్తున్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా నుదుటిపై కూడా పూజా తిలకం ఉంది. వారిద్దరి పక్కపక్కనే ఒక వృద్ధురాలు నిల్చోగా, ఆ వృద్ధురాలు వీరిద్దరి చేతులని పట్టుకుని ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. ఈ ఫొటో బయటకు రావడంతో, వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలెక్కారని, అందుకే మహీకా సంప్రదాయబద్ధంగా సిందూరం ధరించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also read: Venkatesh: వెంకటేష్ కి ఇంత డిమాండ్ ఎందుకు.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు!
అయితే, ఈ వైరల్ వార్తల్లో మరియు ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వీరి వివాహం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా గానీ, మహీకా శర్మ గానీ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. గత ఏడాది కాలంగా తమ బంధం గురించి చాలా బహిరంగంగా ఉంటూ వస్తున్న ఈ జంట, నిజంగా పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని కచ్చితంగా అభిమానులతో పంచుకునే వారని వారి సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. బహుశా ఏదైనా ప్రైవేట్ ట్రిప్ లేదా పూజా కార్యక్రమంలో భాగంగా వారు కలిసిన ఒక వృద్ధురాలితో ఈ ఫొటో తీసుకుని ఉండవచ్చని, అక్కడ పూజ ముగించుకున్న తర్వాతే మహీకా నుదుటిపై ఆ బొట్టు, సిందూరం వచ్చాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మహీకా వేలికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ చూసి నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరగగా, ఆమె కేవలం "నాకు మంచి జ్యువెలరీ ధరించడం ఇష్టం" అంటూ ఆ పుకార్లను కొట్టిపారేసింది. హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియన్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరు 2024 జులైలో తో విడాకులు తీసుకోగా ఇరువురికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.

![]() |
![]() |