![]() |
రకరకాల వ్యాపారాలు చేసి విసిగిపోయిన మూవీమొఘల్ డా.డి.రామానాయుడు.. చిత్ర నిర్మాత కావాలనుకున్నారు. అందులో భాగంగానే మద్రాస్ చేరుకున్న ఆయన.. కొందరు మిత్రులు కలిసి అనురాగం అనే సినిమా చేస్తున్నారని తెలిసి అందులో భాగస్వామిగా చేరారు. అయితే టైటిల్స్‌లో ఆయన పేరు వెయ్యడం కుదరదని డైరెక్టర్ చెప్పారు. దాంతో సినిమా పూర్తయ్యే వరకు సెట్‌లోనే ఉండి ప్రొడక్షన్‌కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునేవారు. ఆ అనుభవంతో ఆ తర్వాతి సంవత్సరం ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన రాముడు భీముడు చిత్రంతో సోలో ప్రొడ్యూసర్‌గా మారారు రామానాయుడు. ఈ సినిమా ఘన విజయం సాధించి రామానాయుడుకి నిర్మాతగా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరసగా సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ క్రమంలోనే ద్రోహి అనే సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది.
అప్పటివరకు వరసగా సినిమాలు తీసిన రామానాయుడు ఒక్క సినిమా ఫ్లాప్‌తో అయోమయంలో పడిపోయారు. అప్పటివరకు చేసిన సినిమాల వల్ల 12 లక్షలు నష్టపోయారు. అయినా అధైర్యపడకుండా 15 లక్షల భారీబడ్జెట్‌తో ‘ప్రేమనగర్’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా హిట్ అయి డబ్బులొస్తేనే ఇండస్ట్రీలో ఉండాలనీ, లేకపోతే ఊరికి వెళ్లిపోయి వ్యవసాయం చేసుకోవాలని అనుకున్నారు. అందుకే ఎంతో శ్రద్దగా అన్ని విషయాలూ జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పటివరకు ఎఎన్నార్ చేసిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
సినిమాలో ఎఎన్నార్, జ్యోతిలక్ష్మిలపై ‘లేలేలే.. నా రాజా’ పాటను మరుసటి రోజు చిత్రీకరించేందుకు సెట్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వాణశ్రీ సెట్‌లో కూర్చొని ఆ పాటను వింటున్నారు. ‘నాగేశ్వరరావుగారు ఈ పాట విన్నారా?’ అని రామానాయుడుని అడిగారు వాణిశ్రీ. ‘ఇంకా వినలేదు.. ఇప్ప్పుడు ఆయన వచ్చిన తర్వాత వినిపిస్తాం’ అన్నారు. దానికి వాణిశ్రీ నవ్వి.. ‘ఆయనకు ఇలాంటి పాటలు నచ్చవు. చెయ్యను అని చెప్తారు చూడండి’ అన్నారు.
‘ఆయన తప్పకుండా చేస్తారు. పందెం కాస్తావా?’ అంటూ డైరెక్టర్ ప్రకాశరావు ముందుకొచ్చారు. ఇది జరిగిన కాసేపటికి ఎఎన్నార్ సెట్‌కి వచ్చారు. ఆయన్ని చూసి ‘లేలేలే నా రాజా’ అంటూ పాట పాడారు వాణిశ్రీ. అది విన్న ఆయన ‘ఏ సినిమాలోది ఈ పాట.. దరిద్రంగా ఉంది’ అన్నారు. ‘మన సినిమాలోదే. ఈ పాటను మీరు, జ్యోతిలక్క్ష్మీ చెయ్యాలట’ అన్నారు వాణిశ్రీ. దాంతో రామానాయుడు, ప్రకాశరావు వైపు సీరియస్‌గా చూశారు ఎఎన్నార్. ‘ఈ పాట నేను చెయ్యడం లేదు’ అని అక్కడ్నించి విసురుగా వెళ్లిపోయారు.
ఎఎన్నార్ అటు వెళ్లగానే, వాణశ్రీపై సీరియస్ అయ్యారు రామానాయుడు. ‘నీకు బుద్ధుందా లేదా? కామ్‌గా కూర్చోవచ్చుగా. ఆయన రాగానే ఆ పాటెందుకు పాడాలి?’ అన్నారు. తన వల్ల ఆ పాట క్యాన్సిల్ అవుతుందేమోనని టెన్షన్ పడ్డారు వాణిశ్రీ. మర్నాడు భయంభయంగానే సెట్‌కి వచ్చారు. రామానాయుడు, ప్రకాశరావు హ్యాపీ మూడ్‌లో కనిపించేసరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ‘నాగేశ్వరరావుగారు పాట చెయ్యడానికి ఒప్ప్పుకున్నారు. నువ్వే ఓడిపోయావు’ అన్నారు ప్రకాశరావు.
తన సినిమాల్లోని పాటల్లో అశ్లీల పదాలు ఉండడానికి ఒప్ప్పుకోని నాగేశ్వరరావుగారు ఈ పాట చెయ్యడానికి ఎలా ఒప్ప్పుకున్నారు అనే సందేహం వాణిశ్రీలో బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన్ని కలిసినపుడు ఇదే విషయాన్ని అడిగారు. దానికి అక్కినేని ‘సినిమాలో నేను చేస్తున్న పాత్ర వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి.. ఈ తరహా పాట ఉంటే బాగుంటుందని ప్రకాశరావుగారు కన్విన్స్ చేశారు. ఆయన చెప్పింది కరెక్టే కదా అని నేను కూడా పాట చేసేందుకు ఒప్ప్పుకున్నాను’ అని వివరించారు.
![]() |