![]() |
(ఆగస్ట్ 16 గాయని జిక్కి వర్ధంతి సందర్భంగా..)
తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను మైమరిపించిన గాన కోకిల జిక్కి (పి.జి. కృష్ణవేణి) వర్ధంతి సందర్భంగా చలనచిత్ర పరిశ్రమ, సంగీత ప్రేమికులు ఆమెను ఘనంగా స్మరించుకుంటున్నారు. ఆగష్టు 16న ఆమె భౌతికంగా మనకు దూరమైనా, ఆమె ఆలపించిన వేలాది గీతాలు నేటికీ ప్రతి ఇంటా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జన్మించిన కృష్ణవేణి, ఎలాంటి శాస్త్రీయ సంగీత శిక్షణ పొందనప్పటికీ కేవలం వినికిడి జ్ఞానంతోనే అద్భుతమైన గాయనిగా ఎదగడం విశేషం. చిన్నతనంలో తండ్రితో కలిసి మద్రాస్ స్టూడియోలకు వెళ్లిన సమయంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 1943లో వచ్చిన 'పంతులమ్మ' చిత్రంలో ఆమెకు పాడే అవకాశంతో పాటు నటించే అవకాశం కూడా కల్పించారు.
అక్కడి నుండి ప్రారంభమైన ఆమె సంగీత ప్రయాణం మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ తదితర భాషల్లో పదివేలకు పైగా మధుర గీతాలను ఆలపించి దక్షిణాదిలోనే అగ్రశ్రేణి గాయనిగా నిలిచారు. ఆ తర్వాతి కాలంలో ప్రముఖ గాయకుడు ఏ.ఎమ్. రాజాను ప్రేమవివాహం చేసుకున్న జిక్కి, వ్యక్తిగత జీవితంలోనూ సంగీతంతోనే అనుబంధాన్ని కొనసాగించారు.
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న, జీవితమే సఫలము, చెట్టులెక్క గలవా ఓ నరహరి, పులకించని మది పులకించు, ఆశలు తీర్చవే ఓ జనని, కం కం కం కంగారు నీకేలనే, చిగురాకులలో చిలకమ్మా, ఓహో బంగరు చిలకా, టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ వంటి ఎన్నో సూపర్‌హిట్ పాటలను జిక్కీ ఆలపించారు.
వయసు పైబడినా ఆమె స్వరంలోని తియ్యదనం, పదును తగ్గలేదని రుజువు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' చిత్రంలో ఆమె పాడిన "జాణవులే నెరజాణవులే..." పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఊపేస్తూనే ఉంటుంది. తరాలు మారినా ఆమె గొంతులో ఉన్న ఆ విచిత్రమైన మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.
జిక్కి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె పాడిన ఆల్ టైమ్ హిట్ పాటలను షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఏ కాలానికైనా వన్నె తగ్గని ఆమె గాత్రం తెలుగు సినీ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని కొనియాడుతున్నారు. అమర గాయని జిక్కి గారు మనమధ్య లేకపోయినా, ఆమె వదిలివెళ్లిన అమృత గానాలు ఉన్నంత కాలం శ్రోతల గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
![]() |