![]() |

తెలుగు సినిమాను కళాత్మక విలువలతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాతలలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) అగ్రగణ్యులు. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన, క్లాసిక్ సినిమాల నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు (ఏప్రిల్ 24) ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని అద్భుత ఘట్టాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
1934 ఏప్రిల్ 24న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించిన ఏడిద నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ ఉండేది. ఆ ఆసక్తే ఆయన్ని మద్రాసు రైలెక్కించింది. మొదట నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత 'గీతాకృష్ణా కంబైన్స్' బ్యానర్‌పై 1976లో 'సిరిసిరి మువ్వ' నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే 'పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్' సంస్థను స్థాపించి అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్‌తో ఏడిద నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. వీరి కలయికలో వచ్చిన 'శంకరాభరణం' ఒక చరిత్ర. కేవలం సంగీతం, కళాత్మక విలువలతో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత వచ్చిన 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' చిత్రాలు భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'స్వాతిముత్యం' చిత్రం ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లడం విశేషం.
చిరంజీవి మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో, ఆయనలోని అసలైన నటుడిని ప్రపంచానికి చూపిన ఘనత ఏడిద నాగేశ్వరరావుదే. 'స్వయంకృషి' సినిమాలో చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఈ సినిమాకు గాను చిరంజీవి మొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం వీరి కలయికలో వచ్చిన 'ఆపద్బాంధవుడు' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ప్రతి సినిమా ఒక పాఠం. కమర్షియల్ హంగులకు లోబడకుండా, కథాబలంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని ఆయన నిరూపించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నిర్మించిన అజరామరమైన చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
- ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జయంతి
![]() |