![]() |
![]() |
(ఆగస్ట్ 21 నటి రాధిక పుట్టినరోజు సందర్భంగా..)
హీరోయిన్ అంటే మంచి కలర్ ఉండాలి, అందంగా ఉండాలి. అన్నింటినీ మించి అభినయం బాగుండాలి. అయితే కొందరు నటీమణులు కలర్ కాకపోయినా తమ ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటి వారిలో రాధిక కూడా ఒకరు. చలాకీతనంతోపాటు చిలిపితనం కూడా కనబరిచే రాధిక తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి 1980వ దశకంలో వచ్చిన హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో చిరంజీవితో 20కి పైగా సినిమాల్లో నటించారు, ఆడి పాడారు. చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఘనత దక్కించుకున్నారు రాధిక. 1978లో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధిక.. ఇప్పటికీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
రంగస్థలంపైన, సినిమాల్లోనూ హాస్యనటుడిగా, విలన్‌గా తనదైన ముద్ర వేసిన నటుడు ఎం.ఆర్.రాధ కుమార్తె రాధిక. ఈమెకు చెల్లెలు నిరోషా, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమయ్యారు రాధిక. ఆమె మొదటి హీరో తెలుగు నటుడు సుధాకర్. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సుధాకర్‌తో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. చిరంజీ హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాధిక. ఆ సమయంలో టాలీవుడ్లో ఉన్న అందరు హీరోల సరసన నటించారు.
చిరంజీవితో కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క.. ఇలా 20కి పైగా సినిమాల్లో నటించారు రాధిక. రెగ్యులర్ యాక్షన్ మూవీసే కాకుండా అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం వంటి సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
2000లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వంశోద్ధారకుడు.. రాధిక తెలుగులో నటించిన చివరి సినిమా. తమిళ్, మలయాళంలో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రవితేజ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన రాజా ది గ్రేట్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు రాధిక. నటిగానే కాకుండా కొన్ని సినిమాలు నిర్మించారు రాధిక. సినిమాలకే పరిమితం కాకుండా టీవీ రంగంలోకి కూడా ప్రవేశించి రాడాన్ మీడియా వర్క్స్‌లో తమిళ్, తెలుగు భాషల్లో అనేక టీవీ సీరియల్స్ నిర్మిస్తున్నారు. చాలా రకాల షోలు నిర్వహిస్తున్నారు
![]() |
![]() |