Home  »  Featured Articles  »  40 ఏళ్లు పూర్తి చేసుకున్న కమల్‌హాసన్, కె.విశ్వనాథ్‌ల ఆణిముత్యం ‘స్వాతిముత్యం’

Updated : Mar 13, 2026

కళాతపస్వి కె.విశ్వనాథ్.. కళాత్మక చిత్రాలకు, వైవిధ్యమైన కథలకు చిరునామా. తను చేసే ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత ఉండాలని కోరుకునే విశ్వనాథ్.. శంకరాభరణం తర్వాత తన ధోరణి మార్చుకున్నారు. సంగీత, నత్య ప్రధాన చిత్రాలు చేసేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి చూపించారు. అలా కమల్‌హాసన్ హీరోగా చేసిన సినిమా ‘సాగర సంగమం’. ఈ సినిమా ఘనవిజయం సాధించి వీరి కాంబినేషన్‌కి మంచి పేరు తెచ్చింది. 

‘సాగర సంగమం’ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని కమల్‌తోనే విశ్వనాథ్ చేసిన సినిమా ‘స్వాతిముత్యం’. 1986 మార్చి 13న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 

కథ విషయానికి వస్తే.. మానసికంగా ఎదుగుదల సరిగాలేని శివయ్య(కమల్‌హాసన్) బామ్మ సంరక్షణలో ఉంటాడు. అదే ఊరిలో భర్తను కోల్పోయిన లలిత(రాధిక) అనే మహిళ తన అన్నయ్య దగ్గర ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉంటాడు. శివయ్యకు, లలితకు పరిచయమవుతుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం వల్ల లలిత ఎన్నో కష్టాలు పడుతోందని తన బామ్మ ద్వారా తెలుసుకున్న శివయ్య.. శ్రీరామ నవమి రోజు.. సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలోనే లలిత అనుమతి తీసుకోకుండానే ఆమె మెడలో పసుపుతాడు కట్టేస్తాడు. నలుగురూ నాలుగు మాటలు అంటారు. అదే సమయంలో శివయ్యను లలిత చేతుల్లో పెట్టి అతని బామ్మ కన్నుమూస్తుంది. అక్కడి నుండి భార్యతో సహా పట్టణం వచ్చేస్తాడు శివయ్య. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది అనేది మిగతా కథ. 

శివయ పాత్రలో కమల్‌హాసన్ జీవించాడని చెప్పాలి. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకర్ని ఊహించుకోలేని విధంగా నటనను ప్రదర్శించారు. రాధిక నటన ఎంతో సెటిల్డ్‌గా, మరెంతో హుందాగా అనిపిస్తుంది. శరత్‌బాబు, జె.వి.సోమయాజులు, నిర్మలమ్మ, వై.విజయ, సుత్తి వీరభద్రరావు, దీప, గొల్లపూడి మారుతీరావు తదితరులు మిగతా పాత్రలు పోషించారు. శివయ్య మనవళ్లలో ఒకరిగా ఇప్పటి టాప్ హీరో అల్లు అర్జున్ నటించారు. 

చక్కని కథ, కథనం.. దానికి తగిన మాటలు, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్.. ఇళయరాజా సంగీతం. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా..’, ‘వటపత్ర శాయికి వరహాల లాలి’, ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య..’ ‘మనసు పలికే మౌనగీతం..’ వంటి పాటలు ఆరోజుల్లో సంచలనం సష్టించాయి. ఎక్కడికి వెళ్లినా ఈ పాటలు వినిపించేవి.

1987 సంవత్సరానికిగాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని ఈ చిత్రానికి అందించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నంది అవార్డులు గెలుచుకుంది. ఇవికాక ప‌లు ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అంతేకాదు, భారతదేశం తరఫున ఆస్కార్ ఎంట్రీ పొందిన చిత్రం ‘స్వాతిముత్యం’.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.