Home  »  Featured Articles  »  ఇండియాలో ఆ ఘనత సాధించిన ఏకైక హీరోయిన్‌ విజయశాంతి!

Updated : Jun 24, 2025

 

చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ అంటే గ్లామర్‌ పాత్రలు లేదా సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే పాత్రలు మాత్రమే చేయగలరు అనే పేరు వచ్చేస్తుంది. కానీ, ఆ చట్రంలో ఉండకుండా ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగలను అని నిరూపించిన హీరోయిన్‌ విజయశాంతి. గ్లామర్‌ పాత్రలు, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్లు,  ఫెరోషియస్‌గా ఉండే క్యారెక్టర్లు, కామెడీ ప్రధానంగా సాగే పాత్రలు, సెంటిమెంట్‌ను పండిరచే క్యారెక్టర్లు.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు విజయశాంతి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా లేడీ సూపర్‌స్టార్‌, లేడీ అమితాబ్‌ అనే బిరుదులు సంపాదించుకున్న ఏకైక హీరోయిన్‌. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ టాలీవుడ్‌ టాప్‌ హీరోల సరసన నిలిచారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణిస్తున్న విజయశాంతి జీవితం గురించి, ఆమె సినీ, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

 

1966 జూన్‌ 24న తెలంగాణలోని వరంగల్‌లో సత్తి శ్రీనివాస్‌ ప్రసాద్‌, వరలక్ష్మి దంపతులకు జన్మించారు విజయశాంతి. విశేషం ఏమిటంటే.. విజయశాంతి భర్త పేరు కూడా శ్రీనివాస్‌ ప్రసాదే. 1988లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పుట్టింది వరంగల్‌లోనే అయినప్పటి ఆ తర్వాత వారి కుటుంబం మద్రాస్‌ షిఫ్ట్‌ అయిపోయింది. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని విజయలలిత. ఆమె నుంచి విజయను తీసుకొని విజయశాంతిగా తన స్క్రీన్‌ నేమ్‌ పెట్టారు. 7 ఏళ్ళ వయసులోనే బాలనటిగా ఒక తమిళ సినిమాలో నటించారు విజయశాంతి. భారతీ రాజా తన దర్శకత్వంలో 1979లో రూపొందిన కల్లుక్కుళ్‌ ఈరమ్‌ చిత్రం ద్వారా హీరోయిన్‌ పరిచయం చేశారు. విజయశాంతి మొదటి హీరో సుధాకర్‌. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన కిలాడి కృష్ణుడు చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన హీరోయిన్‌గా నటించడం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్ళలో తెలుగు, తమిళ భాషల్లో 20 సినిమాల్లో నటించారు విజయశాంతి. అయితే ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే చేయడం వల్ల నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఆమెకు రాలేదు. 

 

1983లో టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేటిభారతం చిత్రంలో విజయశాంతికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఇది అభ్యుదయ భావాలు కలిగిన సినిమా కావడంతో గ్లామర్‌ పాత్రలు చేసే విజయశాంతిని హీరోయిన్‌గా తీసుకోవడంపై పలువురు విమర్శించారు. కానీ, టి.కృష్ణ మాత్రం తన సినిమాలోని క్యారెక్టర్‌కి ఆమె పూర్తి న్యాయం చెయ్యగలదని నమ్మారు. మొదటిరోజు జరిగిన షూటింగ్‌లో విజయశాంతి పెర్‌ఫార్మెన్స్‌ చూసి తన నమ్మకం వమ్ము కాలేదు అనుకున్నారు కృష్ణ. ఆ సినిమా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా విజయశాంతికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన 5 సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు టి.కృష్ణ. ఆ సినిమాలతో విజయశాంతికి స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. ముఖ్యంగా ప్రతిఘటన చిత్రంలోని నటనతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఓ పక్క టి.కృష్ణ సినిమాలు చేస్తూనే అప్పటి టాప్‌ హీరోలైన కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో గ్లామర్‌ రోల్స్‌ కూడా చేస్తూ యూత్‌ని కూడా బాగా ఆకట్టుకున్నారు విజయశాంతి. 

 

 

ఆ సమయంలోనే ప్రతిఘటన చిత్రంతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చెయ్యడం మొదలుపెట్టారు విజయశాంతి. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ తరహా సినిమాలతో తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత ఆమెను స్టార్‌ హీరోయిన్‌ని చేసిన సినిమా కర్తవ్యం. టాప్‌ హీరోల సినిమాలు కలెక్ట్‌ చేసిన రేంజ్‌లో ఈ సినిమా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు, నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి. ఒక హీరోయిన్‌కి ఒకే సినిమాకి సంబంధించి మూడు అత్యున్నత అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఆ ఘనతను సాధించారు విజయశాంతి. ఆ తర్వాత చాలా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేశారు. ఆమె కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌లాంటి సినిమా ఒసేయ్‌ రాములమ్మా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని అద్భుతమైన నటనకు ఉత్తమనటిగా నంది అవార్డుతోపాటు ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు విజయశాంతి. ఇలా మహిళా ప్రధాన పాత్రలో ఆమె ఓ డజను సినిమాలు చేశారు. టాలీవుడ్‌లోని హీరోయిన్లలో విజయశాంతికే ఆ ఘనత దక్కింది. 

 

సాధారణంగా హీరోలైనా, హీరోయిన్లు అయినా ఒక తరహా పాత్రలో నటించి బాగా పేరు తెచ్చుకుంటే ఆ తరహా పాత్రలకే వారిని పరిమితం చేస్తారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వారి మనసుకు నచ్చిన క్యారెక్టర్‌ చేసే అవకాశం కెరీర్‌ మొత్తంలో కూడా రాదు. అయితే విజయశాంతి విషయంలో అది పూర్తి విరుద్ధంగా జరిగింది. అమాయకమైన పాత్రలు, హీరోల పక్కన డాన్సులు చేసే క్యారెక్టర్లు, కుటుంబ కథా చిత్రాల్లో సెంటిమెంట్‌ను పండిరచే పాత్రలు, విలన్లను చితక్కొట్టే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, విప్లవ భావాలు కలిగిన యువతిగా, కామెడీ పాత్రలు.. ఇలా ఒక తరహా పాత్రలకే పరిమితం అయిపోకుండా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించిన ఏకైక హీరోయిన్‌ విజయశాంతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

1980లో మొదలైన ఆమె కెరీర్‌ 2006లో విడుదలైన నాయుడమ్మ సినిమా వరకు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 200 సినిమాల్లో నటించారు విజయశాంతి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మహేష్‌ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇటీవల విడుదలైన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009లో టీఆర్‌ఎస్‌ తరపున మెదక్‌ ఎంపీగా గెలిచారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.

(జూన్‌ 24 విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా..)

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.