![]() |
![]() |

వెండితెరపై ఆధునిక 'సూపర్‌మేన్'ను సృష్టించిన ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ రిచర్డ్ డన్నర్ ఇకలేరు. సోమవారం ఆయన కన్నుమూసినట్లు ఆయన భార్య, నిర్మాణ భాగస్వామి లారెన్ షులర్ డన్నర్ వెల్లడించారు. రిచర్డ్ డన్నర్ వయసు 91 సంవత్సరాలు. 1976లో వచ్చిన 'ది ఆమెన్' మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన ఆయన, తొలి సినిమాతోటే మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు.
1978లో వచ్చిన 'సూపర్‌మేన్' సినిమాతో డన్నర్ ప్రపంచవ్యాప్తంగా అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. ఆ సినిమాను డైరెక్ట్ చేసేందుకు నిర్మాతలు ఆయనకు ఏకంగా 1 మిలియన్ డాలర్లను ఆఫర్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. టైటిల్ రోల్‌లో క్రిస్టఫర్ రీవ్‌ను తీసుకొని, ఆయనకు సూపర్‌మేన్ అనే ట్యాగ్ జీవితకాలమంతా ఉండేట్లు చేయగలిగారు డన్నర్. 21వ శతాబ్దంలోనూ సూపర్‌హీరో జానర్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడంలో ఆయన కృషి ఎంతగానో ఉంది.
'సూపర్‌మేన్' తర్వాత 'ఇన్‌సైడ్ మూవ్స్' (1980), 'ద టాయ్' (1982), 'ద గూనీస్' (1985), 'లేడీహాక్' (1985) చిత్రాలు తీశారు డన్నర్. ఈ చివరి సినిమాతో ఆయనకు భవిష్యత్తులో భార్యగా మారిన లారెన్ షూలర్ పరిచయమయ్యారు. 1986లో వారు పెళ్లి చేసుకున్నారు. 1993లో ఆ ఇద్దరూ కలిసి 'ద డన్నర్స్ కంపెనీ'ని నెలకొల్పారు. ఆ ప్రొడక్షన్ హౌస్ కింద 'డెడ్‌పూల్', 'ది వోల్వరిన్', 'ఎక్స్-మెన్' లాంటి సూపర్‌హిట్ ఫ్రాంచైజీలను నిర్మించారు. ఆయన రూపొందించిన సినిమాల కలెక్షన్‌ను నేటి కాలానికి విలువ కడితే 1 బిలియన్ డాలర్లకు మించి వసూలు చేసినట్లవుతాయి.
మెల్ గిబ్సన్, డానీ గ్లోవర్ ప్రధాన పాత్రధారులుగా డన్నర్ డైరెక్ట్ చేసిన బడ్డీ-కాప్ యాక్షన్ ఫిల్మ్ 'లెథల్ వెపన్' (1987) బ్లాక్‌బస్టర్ హిట్టయి, పలు సీక్వెల్స్ రావడానికీ, ఒక టీవీ షో రావడానికీ కారణమైంది. తర్వాత కాలంలో స్క్రూజ్డ్, లెథల్ వెపన్ 2, మావరిక్, కాన్‌స్పిరసీ థియరీ, రేడియో ఫ్లయర్ లాంటి సినిమాలు తీశారు డన్నర్.
![]() |
![]() |