![]() |
![]() |
ముంబై సముద్ర జలాలపై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు కింద షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ టీమ్ అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్ను ముంబై కోర్టు తిరస్కరించింది. గురువారం వరకు అతను ఎన్సీబీ కస్టడీలో ఉండాల్సిందిగా ఆదేశించింది. బెయిల్ విచారణ సందర్భంగా కోర్టుకు ఆర్యన్ తల్లిదండ్రులు షారుక్, గౌరీ ఖాన్ హాజరుకాలేదు.
"విచారణ అనేది అన్నింటికంటే ప్రాముఖ్యత కలిగింది, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఇటు నిందితులకు, అటు పరిశోధకులకు కూడా ప్రయోజనకరమే" అని ఆర్యన్ ఖాన్, మిగతా ఏడుగురి కస్టడీని పొడిగించిన సందర్భంగా జడ్జి అన్నారు. న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఆర్యన్ మౌనంగా ఉండిపోగా, అతని ఫ్రెండ్స్ అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా దుఃఖం ఆపుకోలేక రోదించారు.
ముంబై నుంచి గోవా వెళ్తున్న కార్డెలియా క్రూయిజ్ నౌకలో శనివారం సాయంత్రం రేవ్ పార్టీ జరుగుతుండగా, ప్రయాణీకుల మాదిరిగా ఆ నౌకలో ఉన్న ఎన్సీబీ టీమ్ ఆర్యన్ సహా ఎనిమిదిమందిని అరెస్ట్ చేసింది.
ఎన్సీబీ దాడిలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ మాత్రలు, 5 గ్రాముల ఎండీ లభించినట్లు యాంటీ డ్రగ్స్ బ్యూరో తెలిపింది. బట్టల మాటున, అండర్వేర్, పర్సుల్లో దాచిపెట్టివుండగా వాటిని పట్టుకున్నారు. ఈ కేసులో ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్ జోక్యం ఉందనీ, అందువల్ల అక్టోబర్ 11 వరకూ ఆర్యన్ను తమ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందనీ కోర్టుకు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
అయితే క్రూయిజ్ నౌకలో ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నాననీ, తన దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదని ఆర్యన్ ఖాన్ వాదించాడు.
![]() |
![]() |