![]() |
![]() |

భారతీయ సినీ పరిశ్రమలో ఒక మూవీ సెన్సార్ బోర్డుతో మూడేళ్లకి పైగా పోరాడటం, ఏకంగా మూడు సార్లు పేర్లు మార్చుకోవడం, చివరకి థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీ బాట పట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. అంతటి వివాదాస్పద ప్రయాణాన్ని ఎదుర్కొన్న చిత్రమే 'సట్లెజ్'. పంజాబ్‌కి చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త 'జస్వంత్ సింగ్ ఖల్రా' జీవిత ఆధారంగా తెరకెక్కగా, ప్రముఖ పంజాబీ నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ టైటిల్ రోల్ పోషించాడు.
ఈ నెల 3 న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో ఎటువంటి ప్రమోషన్లు లేకుండా అత్యంత రహస్యంగా, 'గెరిల్లా స్టైల్' లో విడుదలైంది. అయితే, ఊహించని విధంగా డిజిటల్ స్క్రీన్లపైకి వచ్చిన కేవలం 48 గంటల్లోనే, అంటే ఆదివారం సాయంత్రానికల్లా ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తొలగించినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగపడే అంశాలు మూవీలో ఉన్నాయనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అసలు ఈ సినిమా చుట్టూ ఇంతటి వివాదం నడవడానికి కారణం ఈ చిత్ర కథాంశమే. 1980, 1990ల కాలంలో పంజాబ్‌లో జరిగిన తీవ్రవాద అణిచివేత ఉద్యమంలో భాగంగా పంజాబ్ పోలీసులు దాదాపు 25,000 మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను చట్టవిరుద్ధంగా, వారి కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారని జస్వంత్ సింగ్ ఖల్రా ఆధారాలతో సహా ప్రపంచానికి బట్టబయలు చేశారు. ఈ సంచలన నిజాలను వెలికితీసినందుకే 1995లో ఖల్రాను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, పోలీస్ కస్టడీలోనే అత్యంత దారుణంగా హింసించి చంపేశారు. ఈ కేసులో 2005 లో నలుగురు పోలీసు అధికారులకి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించగా, 2007 లో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఈ సున్నితమైన రాజకీయ, చారిత్రాత్మక అంశాల చుట్టూ సినిమా తిరగడమే వివాదానికి ప్రధాన కేంద్ర బిందువైంది.
Also read: Ranaveer singh: రణ్వీర్ సింగ్ నా హీరో కాదు.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎమోషనల్ ట్వీట్
సట్లెజ్ ప్రయాణం మొదటి నుంచీ ముళ్లబాటలోనే సాగింది. 2022 లో ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టినప్పుడు దీనికి సిక్కుల చరిత్రలోని మారణహోమాలని సూచించే 'ఘల్లుఘరా' (Ghallughara) అనే పేరు పెట్టారు. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి, మొదట 21 కట్స్ ని సూచించడంతో పాటు పేరును 'పంజాబ్ 95' (Panjab 95) గా మార్చాలని ఆదేశించింది. దీనిపై చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, రివిజన్ కమిటీ ఏకంగా 127 కట్స్ కి డిమాండ్ చేసింది. ఇందులో సినిమాలోని ప్రధాన పాత్ర అయిన జస్వంత్ సింగ్ ఖల్రా పేరును, అలాగే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రస్తావనలని పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. ఒక వీరుడి గుర్తింపుని చరిత్ర నుంచి తుడిచేయడమేనని దర్శకుడు హనీ ట్రెహాన్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. చివరకి థియేటర్లలో విడుదల చేసేందుకు వీలుపడకపోవడంతో, పేరును 'సట్లెజ్' (Satluj) గా మార్చి, ఎటువంటి ముందస్తు ప్రచారాలు లేకుండా జీ5 లో విడుదల చేశారు. ప్రమోషన్స్ చేస్తే ఎక్కడ విడుదలను ఆపేస్తారోననే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్జీత్ దోసాంజ్ పేర్కొన్నారు.
satluj, diljit dosanjh, Zee5
![]() |
![]() |