![]() |

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అధికారం, న్యాయం మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ 'సిస్టమ్' (System) విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
'సిస్టమ్' సినిమా మే 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బవేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బవేజా, పమ్మీ బవేజా, స్మిత బలిగా నిర్మించారు. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం యొక్క అసలు అర్థాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.
'సిస్టం' చిత్రంలో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), జ్యోతిక (Jyothika), అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశీ, సాధారణ స్టెనోగ్రాఫర్ సారికా రావత్ కలిసి వ్యవస్థలో దాగి ఉన్న అన్యాయాలను ఎలా వెలికితీశారు అనేదే ఈ సినిమా కథ.
హర్మన్ బవేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. కేవలం లీగల్ డ్రామాగానే కాకుండా, భావోద్వేగాల లోతును కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఆశయం, నైతికత, సత్యం వంటి అంశాల చుట్టూ తిరిగే 'సిస్టమ్' సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మే 22న ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
![]() |