![]() |
![]() |
శుక్రవారం అక్టోబర్ 8 బాలీవుడ్ సూపర్‌స్టార్ గౌరీ ఖాన్ 51వ పుట్టినరోజు. ప్రతి బర్త్‌డేకీ సందడి సందడిగా ఉండే షారుక్ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉండిపోయింది. గౌరీ ఖాన్ బర్త్‌డేకి సెలబ్రేషన్స్ అనేవి లేకుండా పోయాయి. కారణం వారి కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ఇదే రోజు కోర్టు తిరస్కరించింది. దాంతో ఆర్యన్‌ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఆర్యన్‌కు బెయిల్ రాలేదని తెలిసి గౌరీ ఖాన్ పడుతున్న ఆవేదన మామూలుగా లేదని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 2న ముంబై నుంచి గోవాకు బయలుదేరిన క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) టీమ్ దాడిచేసి ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసింది. అప్పట్నుంచీ ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు. గురువారం ముంబై కోర్టులో ఆర్యన్ హాజరు కాగా, కోర్టు అతడికి జుడిసియల్ కస్టడీ విధించింది. శుక్రవారం అతడి బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
గౌరీ ఖాన్ 51వ బర్త్‌డే సందర్భంగా సుజానే ఖాన్, ఫరా ఖాన్ లాంటి కొంతమంది బర్త్‌డే విషెస్ తెలిపారు. కానీ వాటిని స్వీకరించే స్థితిలో గౌరి లేరు. ఆర్యన్‌కు బెయిల్ లభించినట్లయితే కచ్చితంగా అది గౌరీకి బర్త్‌డే గిఫ్ట్ అయివుండేది.
![]() |
![]() |