![]() |
![]() |
నిన్నటి తరం అగ్ర కథానాయిక రేవతి మంచి నటీమణి మాత్రమే కాదు.. మంచి దర్శకురాలు కూడా. `మిత్ర్ - మై ఫ్రెండ్` (భారతీయ ఆంగ్ల చిత్రం), `ఫిర్ మిలేంగే` (హిందీ), `కేరళ కేఫ్` (మలయాళం `ఆంథాలజీ` ఫిల్మ్ - ఇందులో `మగళ్` అనే సెగ్మంట్ ని డైరెక్ట్ చేశారు), `ముంబయి కటింగ్` (హిందీ `ఆంథాలజీ` ఫిల్మ్ - ఇందులో `పార్సెల్` అనే సెగ్మంట్ కి దర్శకత్వం వహించారు).. ఇలా మొత్తంగా నాలుగుసార్లు మెగాఫోన్ పట్టారు రేవతి. వీటిలో `మిత్ర్`.. మూడు జాతీయ పురస్కారాలను దక్కించుకోవడం విశేషం.
ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంతరం రేవతి మరోమారు `రోల్, కెమెరా, యాక్షన్, కట్` అంటూ సెట్స్ లో కెప్టెన్ గా సందడి చేయనున్నారు. `ది లాస్ట్ హురై` పేరుతో తెరకెక్కనున్న ఈ హిందీ చిత్రంలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. సుజాత అనే ఓ మహిళ తన జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంది? అనే కథాంశంతో `ది లాస్ట్ హురై` రూపొందనుంది. మనసుల్ని కదిలించే ఈ చిత్రంలో కాజోల్ నటన ప్రధాన బలం కానుందని.. త్వరలోనే ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ పట్టాలెక్కనుందని బాలీవుడ్ సమాచారం. మరి.. కాజోల్, రేవతి ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న `ది లాస్ట్ హురై` ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |