ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు.. టాలీవుడ్ డైరెక్టర్ అడ్వంచర్!
on Feb 13, 2026
ఒకే సినిమాలో ఒకరి కంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటే వారిని, వారి క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. గతంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం పెరగడం, దానికి తగ్గట్టుగానే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దానికి అనుగుణంగానే పారితోషికాలు కూడా పెరిగాయి. అలాంటి పరిస్థితుల్లో గతంలో మాదిరిగా ఒకరి కంటే ఎక్కువ హీరోయిన్లతో సినిమాలు చేయడం అనేది ఇప్ప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. కానీ, డైరెక్టర్ క్రిష్ ఆ సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.
కమర్షియల్ పంథాలో వెళ్లడం కంటే కంటెంట్ ప్రధానంగా సినిమా చెయ్యాలని భావించే డైరెక్టర్లలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమా కథలు విభిన్నంగా ఉండడమే కాకుండా కొన్ని సామాజిక అంశాల్ని కూడా స్పశించేలా ఉన్నాయి. గమ్యం, వేదం, కంచె వంటి సినిమాలు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాయి. బలమైన కథ, సహజమైన పాత్రలు, సన్నివేశాలు.. వంటివి క్రిష్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే గత ఏడాది అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించిన ఘాటి చిత్రం మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది.
ఘాటి చిత్రంపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో తను చేయబోయే తదుపరి చిత్రంపై ప్రత్యేక దష్టి పెట్టారు క్రిష్. ఈసారి పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా అడ్వంచర్ జోనర్‌లో సినిమా చెయ్యాలని క్రిష్ భావిస్తున్నట్టు సమాచారం. ట్రెకింగ్ నేపథ్యంలో కథను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. పర్వతాలు, ఫారెస్ట్, ప్రకతి అందాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా భిన్నమైన సినిమాగా ఇది ఉండబోతోంది.
ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. ఇందులో ఏడుగురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆ ఏడుగురు ఎవరు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఎవరి పాత్రనూ తక్కువ చేయకుండా అందర్నీ హైలైట్ చేసే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు క్రిష్. అంత మంది హీరోయిన్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఆయా పాత్రల డిజైనింగ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరి క్యారెక్టర్‌ను తక్కువగా చూపించినా అది పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమస్య రాకుండా స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్రిష్. ప్రస్తుతం హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



