‘మన శంకర వరప్రసాద్‌గారు’ విడిపోవాలనుకున్న జంటను కలిపారు!
on Jan 16, 2026
భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు, అభిరుచుల్లో మార్పులు.. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే వాటిని పరిష్కరించుకొని కాపురం చేసేవారు కొందరుంటారు. కానీ, కొందరు మాత్రం వాటి కారణంగానే విడిపోవడానికి కూడా సిద్ధపడతారు. అలా తమ సంసారంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోకుండా విడిపోవాలని నిర్ణయించుకున్న జంటను మన శంకర వరప్రసాద్‌గారు కలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మన శంకర వరప్రసాద్‌గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైంది. రిలీజ్ రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సూపర్‌హిట్ దిశగా పరుగులు తీస్తోంది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినాను మరోసారి చూపిస్తోంది. చక్కని ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఇంటర్వ్యూను సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ప్రభావం ప్రేక్షకులపై ఎంతగా ఉందో చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రస్తావించారు. గత మూడు నెలలుగా విడాకులు తీసుకోవాలని ఓ జంట సిద్ధమైందని, ఈ సినిమా చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని వివరించారు. ఈ విషయాన్ని తనకు ఆ జంట షేర్ చేసిందని తెలిపారు మెగాస్టార్. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉంటే ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో సినిమాలో చూపించామని అన్నారు. సినిమా అనేది ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. మెగాస్టార్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



