అన్ని భాషల స్టార్ హీరోలను ఇబ్బంది పెడుతున్న మోహన్‌లాల్!
on Apr 18, 2025
ఒక భాషలో సూపర్‌హిట్ అయిన సినిమా భారతదేశంలోని వివిధ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా అదే స్థాయి విజయాన్ని అందుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో రూపొందిన ‘దృశ్యం’ చిత్రం వల్లే సాధ్యమైంది. 2013లో విడుదలైన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళ్‌లో కమల్‌హాసన్, కన్నడలో రవిచంద్రన్, హిందీలో అజయ్ దేవ్‌గన్ రీమేక్ చేసి సాలిడ్ హిట్ సాధించారు. ఇండియాలోనే కాదు, శ్రీలంక, ఇండోనేషియా, చైనా, కొరియా భాషల్లో రీమేక్ అయింది. అలాగే ఇంగ్లీష్ భాషలో అమెరికాలో రీమేక్ అయింది. ఇలా ఒక ఇండియన్ సినిమా ఇన్ని భాషల్లో రీమేక్ అవ్వడం అనేది అరుదైన విషయం.
ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా 2021లో ‘దృశ్యం2’ పేరుతో నిర్మించారు. ఇది కూడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయి సూపర్‌హిట్‌గా నిలిచింది. గత కొంత కాలంగా ‘దృశ్యం3’కి సంబంధించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. మేలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యధావిధిగా వివిధ భాషల్లో రీమేక్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ, దానికి భిన్నంగా ‘దృశ్యం3’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మోహన్‌లాల్ కూడా పార్ట్ 3ని ఇండియాలోని వివిధ భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. దర్శకుడు జీతు జోసఫ్, నిర్మాత ఆంటోని పెరువంబూర్ దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘దృశ్యం3 ది కంక్లుజన్’ పేరుతో మూడో భాగాన్ని రూపొందిస్తారట.
మోహన్‌లాల్‌తోపాటు దర్శకనిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వెంకటేష్, అజయ్ దేవ్‌గణ్. ఎందుకంటే ఈ రెండు భాషల్లో దృశ్యం చిత్రానికి ఎక్కువ అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా వెంకటేష్ పోషించిన రాంబాబు తెలుగు వారికి బాగా కనెక్ట్ అయింది. రెండు భాగాల్లోనూ వెంకటేష్‌ని చూసిన తెలుగు ప్రేక్షకులు అదే క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ కనిపిస్తే యాక్సెప్ట్ చేస్తారా అనేది పెద్ద సందేహంగా మారింది. పార్ట్ 3 వెంకటేష్ చేస్తే బిజినెస్ పరంగా కూడా బాగా ప్లస్ అవుతుంది. మోహన్‌లాల్ నటించిన వెర్షన్‌నే తెలుగులో రిలీజ్ చేస్తే దాన్ని డబ్బింగ్ సినిమాగానే చూస్తారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే.. ‘దృశ్యం3’ పేరుతో అజయ్ దేవ్‌గణ్ తన సొంత బేనర్‌లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని దృశ్యం సిరీస్‌లో భాగంగా కాకుండా వేరే కథతో చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు ఎవరు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
తెలుగులో రీమేక్ అయిన ‘దృశ్యం2’కి కూడా జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో పార్ట్ 3కి సంబంధించి వెంకటేష్, జీతుల మధ్య ఎలాంటి డిస్కషన్ జరగలేదని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో వెంకటేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే ‘దృశ్యం3’ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసినా, మలయాళంలో రిలీజ్ చేసి అన్ని భాషల్లో రీమేక్ చేసుకునే అవకాశం ఇచ్చినా ఫర్వాలేదు అనే ధోరణిలోనే వెంకటేష్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్‌లాల్ ఆలోచన ప్రకారం ప్రస్తుతం పార్ట్ 3ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల వివిధ భాషల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దానిపై కూడా మేకర్స్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పార్ట్ 3 తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘దృశ్యం’ పార్ట్ 3 విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
