రాజుతో ప్రేమాయణం గురించి సమంత ఇప్పుడైనా స్పందిస్తుందా?
on Feb 3, 2025
సినిమా రంగంలో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం అని మనం పదే పదే చెప్పుకుంటూనే ఉంటాం. అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎంతో ఆసక్తిగా వాటి గురించి తెలుసుకుంటాం. అంటే.. ఎంత సర్వసాధారణమైనా ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ఇటీవలికాలంలో పలు సినిమా ఇండస్ట్రీ జంటలు విడాకులు తీసుకున్నట్టు, కొందరు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అన్నింటిలోనూ నాగచైతన్య, సమంత విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలు జరిగాయి. అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్లిన సమంత ఆ హుందాతనాన్ని కాపాడుకోలేక నాగచైతన్యతో విడిపోయిందని బాధపడిన వారు చాలా మంది ఉన్నారు. మొదట రూమర్‌గా ప్రారంభమైన వారి విడాకుల కథ.. చివరికి విడిపోయే వరకు వచ్చింది. విశేషమేమిటంటే.. వీరిద్దరూ ఎవరి జీవితాలు వారు కొనసాగిస్తున్నా.. ఇద్దరూ ఒకటి కాకపోతారా అని ఎదురుచూసిన అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్దరూ ఎవరి జీవితం వారిది అనే ఓ స్థిర అభిప్రాయానికి వచ్చినట్టు తర్వాతికాలంలో తెలిసింది.
సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన నాగచైతన్య ఇటీవల నటి శోభిత దూళిపాళ్లను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సమంత విషయానికి వస్తే.. విడాకుల తర్వాత కొన్నాళ్లు ఆమె లైఫ్ ఒంటరిగా హ్యాపీగానే గడిచినా ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడడంతో చాలా కాలం దానికి సంబంధించిన చికిత్స తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడంతోనే గడిచిపోయింది. ఎట్టకేలకు ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. సిటాడెల్ సిరీస్‌లో ఆమె నటించింది. దీని ప్రమోషన్స్ సందర్భంగా రెండో పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నలకు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే సిటాడెల్, ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల్లో ఒకరైన రాజు నిడుమోరుతో డేటింగ్‌లో ఉందన్న వార్త ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్‌లో కూడా సమంత నటించింది. ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ దగ్గరయ్యారని తెలుస్తోంది. ఈ వార్తలకు తగ్గట్టుగానే సమంత, రాజు.. ఫ్యామిలీ మ్యాన్ 3 పార్టీలో కనిపించడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం కన్‌ఫర్మ్ అయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నయ్ ఛాంపియన్స్‌కి సపోర్ట్ చేస్తున్న సమంత... ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజు నిడుమోరుతో కలిసి మరోసారి కనిపించడంతో వీరి ప్రేమాయణం పీక్స్‌కి చేరుకుందనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సమంత, రాజు గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా.. వాటిని సమంత ఏమాత్రం పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చినా క్షణాల్లో స్పందించి.. ఘాటుగా సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో సైలెంట్‌గా ఎందుకు ఉంటోంది అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. సమంత, రాజు నిడుమోరు గురించి గతంలో వచ్చిన రూమర్స్ కంటే.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మరి ఇప్పుడైనా సమంత స్పందిస్తుందో, లేదో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
