ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు..!
on Jun 29, 2025
రీసెంట్ గా 'కన్నప్ప'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచు విష్ణు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. మంచి వసూళ్ళతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్నేళ్లుగా ఓ మంచి సక్సెస్ కోసం చూస్తున్న విష్ణుకి ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఆయన మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.
కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గానూ తనదైన ముద్ర వేశాడు ప్రభుదేవా. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన.. తెలుగులో ఆ తర్వాత 'పౌర్ణమి', 'శంకర్ దాదా జిందాబాద్' వంటి సినిమాలు చేశాడు. తమిళ్ లోనూ నాలుగు సినిమాలు చేసిన ప్రభుదేవా.. ముఖ్యంగా హిందీలో పలు సినిమాలు చేశాడు. 2021 లో వచ్చిన 'రాధే' తర్వాత దర్శకుడిగా సినిమాలు చేయని ఆయన.. నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నట్లు వినికిడి. ఇప్పటికే విష్ణు, ప్రభుదేవా మధ్య కథా చర్చలు జరిగాయని.. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అంటున్నారు. తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విష్ణునే ఈ సినిమాని నిర్మించనున్నాడట.
విష్ణుకి ఎంటర్టైనర్స్ నప్పుతాయి. ఢీ, దేనికైనా రెడీ వంటి సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో అలరించి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రభుదేవాతో కలిసి మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
