ఎన్టీఆర్ వెనకడుగు.. రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్న బాలయ్య!
on Sep 28, 2025

డిసెంబర్ 5న 'అఖండ 2'తో ప్రేక్షకులను పలకరించనున్నారు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). ఆ తర్వాత దర్శకులు గోపీచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడితో సినిమాలు కమిటై ఉన్నారు. తాజాగా మరో దర్శకుడితో బాలకృష్ణ చేతులు కలపబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కొరటాల శివ. (Koratala Siva)
గతేడాది జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో చేసిన 'దేవర'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు కొరటాల. దానికి సీక్వెల్ గా ఆయన 'దేవర 2' చేయాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' చేస్తున్నారు. అలాగే నెల్సన్ తో ఓ యాక్షన్ ఫిల్మ్, త్రివిక్రమ్ తో ఓ మైథలాజికల్ మూవీ కమిటై ఉన్నారు. ఎన్టీఆర్ చేతిలో పలు ఇతర భారీ సినిమాలు కూడా ఉండటంతో.. 'దేవర 2' ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ఈ గ్యాప్ లో మరో సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు సమాచారం.
ఇటీవల నాగచైతన్యతో కొరటాల ఓ సినిమా చేసే అవకాశముందని న్యూస్ వినిపించింది. కానీ, ఆ న్యూస్ లో వాస్తవం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు అనూహ్యంగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో కొరటాల ఓ పొలిటికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సింహా'కి కొరటాల రచయిత. అందుకే వీరి కలయికలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా, అది పొలిటికల్ ఫిల్మ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
కాగా, బాలకృష్ణ చేతిలో కూడా 'అఖండ 2' కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. 'దేవర 2' స్టార్ట్ చేయాలంటే ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా బాలయ్య కోసం కొరటాల ఎదురుచూడక తప్పేలా లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



