శివ డైరెక్షన్ లో సినిమాకి ఓకే చెప్పిన రవితేజ!
on Jul 11, 2025

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆగస్టు 27న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేస్తున్న ప్రాజెక్ట్.. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే 'మ్యాడ్' కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది డిసెంబర్ లో పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవితేజకు ఇటీవల దర్శకుడు శివ నిర్వాణ ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది. శివ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన రవితేజ.. సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వినికిడి. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల రామ్ పోతినేనికి కూడా శివ నిర్వాణ కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరి అది ఇది ఒకే కథేనా? లేక వేరు వేరు కథలా? అనేది తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



