బిగ్ అప్డేట్.. బాహుబలి సిరీస్ నుంచి మరో మూవీ!
on Sep 26, 2025

బాహుబలి ఫ్రాంచైజ్ లో కట్టప్ప పాత్రకు ప్రత్యేక స్థానముంది. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ఒక్క ప్రశ్నతో బాహుబలి పార్ట్-2 పై అప్పట్లో ఎంత హైప్ నెలకొన్నదో తెలిసిందే. బాహుబలి సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కట్టప్ప గురించి మాట్లాడుకుంటేనే ఉంటారు. అంతలా ప్రేక్షకుల మనస్సులో కట్టప్ప పాత్ర నిలిచిపోయింది. మరి అలాంటి పాత్రతో స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది. త్వరలోనే అది సాధ్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కట్టప్ప పాత్రతో ప్రత్యేకంగా ఒక సినిమా చేసే సన్నాహాల్లో రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాజమౌళి ఉన్నట్లు సమాచారం. తన ఖడ్గంతో శత్రువులకు సమాధానం చెప్పగల యోధుడైన కన్నప్ప, మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా ఎందుకు మారాడు? కట్టప్ప కథ ఏంటి? అతని కుటుంబ చరిత్ర ఏంటి? వంటి అంశాలతో కథను సిద్ధం చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. అయితే ఈ సినిమాకి రాజమౌళి క్రియేటర్ గా మాత్రమే వ్యవహరిస్తారని, వేరొకరు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.
కాగా, రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇది 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ సినిమాతో బిజీ ఉన్నప్పటికీ.. కట్టప్ప సినిమా కోసం రాజమౌళి తన ఇన్ పుట్స్ ఇస్తున్నట్లు టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



