నాని 'మీట్ క్యూట్'లో కాజల్!!
on Jun 19, 2021
నేచురల్ స్టార్ నాని ఒక వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచుకి తగ్గట్లు సినిమాలు నిర్మించి మెప్పిస్తున్నాడు. ఇప్పటికే వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ పై నాని నిర్మించిన.. అ!, హిట్ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం నాని ప్రొడక్షన్ లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి హిట్-2 కాగా, మరోకటి 'మీట్ క్యూట్'.
మీట్ క్యూట్ సినిమాకి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనుండడం విశేషం. అలాగే ఈ సినిమాలో ఐదురుగు హీరోయిన్స్ నటించనుండడం మరో విశేషం. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తామని నాని ఇటీవల చెప్పాడు. అయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా.. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అలాగే మిగతా హీరోయిన్లుగా నివేదా థామస్, రుహానీ శర్మ, ఆదా శర్మ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'లో నటిస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగార్జున సరసన నటిస్తోంది.