తెలుగు సినిమా డైలాగ్స్‌ను కొత్త పుంతలు తొక్కించిన ముళ్లపూడి వెంకటరమణ!
on Jun 28, 2025
(జూన్ 28 ముళ్లపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా..)
బాపు, రమణ... ఈ రెండు పేర్లు తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ రెండు పేర్లు విడిపోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి స్నేహబంధం అంత గొప్పది. అచ్చ తెలుగుదనాన్ని ప్రేక్షకులకు పంచిన వీరిద్దరిలో ఒకరు దర్శకుడు, చిత్రకారుడు, మరొకరు రచయిత. చిన్నతనంలోనే రచయితగా తన జీవితాన్ని ప్రారంభించిన ముళ్లపూడి వెంకటరమణ... అనతి కాలంలోనే సినీ సాహితీ రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పటికి ఎంతో మంది రచయితలు ఉన్నప్పటికీ ఒక భిన్నమైన శైలిలో రచనలు సాగించి.. తన రచనల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అల్లరి పిల్లవాడు ‘బుడుగు’ పాత్రను సృష్టించి దాని ద్వారా పాఠకులకు అమితానందాన్ని కలిగించారు. ఋణానంద లహరి, విక్రమార్కుని మార్కు సింహాసనం, గిరీశం లెక్చర్లు వంటి రచనలు ఆయన సినీ రంగానికి రాకముందే ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి కొత్త తరహా సంభాషణలు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో ఎ.భీమ్‌సింగ్ రూపొందించిన ‘పాశమలార్’ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో వి.మధుసూదనరావు దర్శకత్వంలో సుందర్‌లాల్ నహతా, డూండీ నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ముళ్ళపూడిని మాటల రచయితగా ఎంపిక చేశారు. కామెడీ రచనలకు పేరుగాంచిన ముళ్ళపూడిని అన్నా చెల్లెళ్ళ కథతో పూర్తి సెంటిమెంట్ నిండి ఉన్న సినిమాకి మాటలు ఎలా రాయగలడు అంటూ అంతా విమర్శించారు. కానీ, ‘రక్త సంబంధం’ చిత్రానికి అద్భుతమైన మాటలు రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో పడ్డారు ముళ్ళపూడి. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన మూగమనసులు, దాగుడుమూతలు, తేనెమనసులు, కన్నెమనసులు, పూలరంగడు చిత్రాలకు ముళ్ళపూడి కథను సమకూర్చారు. ‘మూగమనసులు’కు ఆచార్య ఆత్రేయతో కలసి కథ, మాటలు అందించిన ముళ్ళపూడి తొలిసారి సోలో కథకునిగా ‘దాగుడుమూతలు’ రాశారు. అలా కొన్ని సినిమాలకు కథ, కొన్ని సినిమాలకు మాటలు రాస్తూ రచయితగా బిజీ అయిపోయారు. కథా రచయితగా, మాటల రచయితగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు ముళ్ళపూడి.
తన మిత్రుడు బాపు తొలిసారి దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రానికి కథ, మాటలు రాశారు ముళ్ళపూడి. ఈ సినిమా బాపు, రమణలతోపాటు ఈ సినిమాలో నటించిన కృష్ణ, విజయనిర్మలకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాపు, రమణల కాంబినేషనలో ఎన్నో సినిమాలు రూపొందాయి. బంగారు పిచిక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతాకళ్యాణం, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, రాధా కళ్యాణం, త్యాగయ్య, పెళ్ళీడు పిల్లలు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీరామరాజ్యం.. ఇలా ఎన్నో సినిమాలకు కలిసి పనిచేస్తూ చివరి వరకు ప్రాణ స్నేహితులుగా కొనసాగారు.
ముళ్ళపూడి తన రచనల్లో మెరుపులు మెరిపించేవారు కానీ, వ్యక్తిత్వ పరంగా చూస్తే ఎంతో మృధు స్వభావి. విభేదాలు లేకుండా అందరితోనూ ఎంతో బాగా కలిసిపోయేవారు. అయితే ఆయన మనసుకు బాధ కలిగితే ఆ దరిదాపుల్లో కనిపించేవారు కాదు. ముళ్ళపూడికి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుతో మంచి అనుబంధం ఉండేది. ఒకసారి పూలరంగడు సినిమా సమయంలో ముళ్ళపూడి మనసు నొచ్చుకుంది. అంతే.. తర్వాత ఆ సంస్థకు ఆయన పనిచేయలేదు. చాలా కాలం తర్వాత బాపు దర్శకత్వంలో ఆ సంస్థ ఓ సినిమా నిర్మిస్తుండడంతో స్నేహితుడి కోసం ఆ సినిమాకి పనిచేశారు ముళ్ళపూడి. ఆయనది ఎంతటి సున్నితమైన మనసు అంటే.. ఒక పెద్ద హీరో.. తాను నిర్మిస్తున్న సినిమాకు డబ్బు అవసరం అయితే.. పూచికత్తు ఉండి 25 లక్షలు ఇప్పించారు. ఆ హీరో ఆ డబ్బు కట్టకపోతే తన ఇంటిని అమ్మేసి ఆ అప్పు తీర్చారు ముళ్లపూడి. తర్వాత కూడా ఆ హీరో నుంచి డబ్బు ముళ్లపూడికి రాలేదు. అయినా ఆ హీరో గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
