తెలుగు వారికి పెళ్లి పాటలు అందించిన ఘనత ఎన్టీఆర్, బాలకృష్ణలకే దక్కుతుంది!
on Apr 23, 2025
నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్‌లో ‘సీతారామకళ్యాణం’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పురాణ గాథల్లోని పాత్రల పట్ల ఎన్టీఆర్‌కు ఒక భిన్నాభిప్రాయం ఉండేది. ఆయా పాత్రల తీరు తెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని మంచి చెడ్డలను బేరీజు వేసుకునేవారు. అలా రావణ పాత్ర మీద ఆయనకు అమితమైన మక్కువ కలిగింది. రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషుల పాత్రలకు జీవం పోసి దేవుళ్లకు ప్రతిరూపంగా నిలిచారు ఎన్టీఆర్. ఆరోజుల్లో ఆ దేవుళ్ల రూపంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలను ఇంట్లో పెట్టుకునేవారు. అలాంటి ఎన్టీఆర్ రావణాసురుడిగా కూడా మెప్పించి ఆ రెండు పాత్రలు పోషించడంలో తనకు తనే సాటి అనిపించుకున్నారు. భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మగా నటించిన ఆయన ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో రాముడిగానూ, రావణాసురుడిగానూ నటించి మెప్పించడం అనేది ఆయనకే చెల్లింది. ‘సీతారామకళ్యాణం’ చిత్రం విషయానికి వస్తే.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో రావణుడిగా తను నటించి, రాముడి పాత్రను అప్పటి యువ హీరో హరనాథ్‌తో చేయించడం సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాకి మొదట కె.వి.రెడ్డిని దర్శకుడుగా అనుకున్నారు ఎన్టీఆర్. అయితే అంతకుముందు ఎన్టీఆర్‌ను కృష్ణుడిగా చూపించిన ఆయన ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. రావణుడిగా ఎన్టీఆర్‌ను చూపించలేను అన్నారు. అప్పుడు ఆ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను ఎన్టీఆరే తీసుకొని పూర్తి చేశారు. అయితే టైటిల్స్‌లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు.
1961లో ఎన్టీఆర్ ‘సీతారామకళ్యాణం’ చిత్రం విడుదలైంది. పాతిక సంవత్సరాల తర్వాత 1986లో నందమూరి బాలకృష్ణ ఇదే టైటిల్‌తో సినిమా చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పౌరాణిక సినిమా కాదు, పూర్తి సాంఘిక చిత్రం. ఈ సినిమా నిర్మాణం వెనుక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరమే బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో రూపొందిన ‘బాబాయ్ అబ్బాయ్’, బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన ‘పట్టాభిషేకం’ రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ జంధ్యాల కాంబినేషన్‌లో సినిమా ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో మొదటి సినిమా తనే నిర్మించాలని యువచిత్ర అధినేత కె.మురారి అనుకున్నారు. కానీ, అప్పటికే ‘బాబాయ్ అబ్బాయ్’ మొదలైపోయింది. అయినా రెండో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట ఈ సినిమాలో భానుప్రియను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ దొరక్కపోవడంతో విజయశాంతిని తీసుకోవాలనుకున్నారు. అయితే బాలకృష్ణతో చేసిన పట్టాభిషేకం ఫ్లాప్ అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని కూడా మానుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌తో చెయ్యాలనుకున్నారు. అది కూడా కుదరకపోవడంతో చివరికి రజనీని ఎంపిక చేశారు.
మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ప్రేమకథా చిత్రం ఏమిటి అని మురారితో చాలా మంది అన్నారు. అతనిది మాస్ ఇమేజ్ అనీ, అతనికి లవ్ డైలాగ్స్ పెడితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరని చెప్పారు. అందుకే అతని ప్రేమ పూర్వకంగా ఉండే డైలాగులు చెప్పించవద్దని రాఘవేంద్రరావు సలహా కూడా ఇచ్చారు. ఆ సలహాను పాటించి బాలకృష్ణతో సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్ చేయించారు జంధ్యాల. చక్కని కథ, కథనం, మధురమైన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. యువ చిత్ర బేనర్‌కి పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కె.వి.మహదేవన్. ఈ బేనర్‌లో వచ్చిన సినిమాలన్నింటికీ ఆయన సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమా పాటల విషయానికి వస్తే.. ఆరు పాటలు ఉన్న ఆడియో క్యాసెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసి శ్రోతలను ఆ పాటలకు మార్కులు వెయ్యమని అడిగారు. అలా సినిమాలో ఏ పాటలు ఉండాలి అనేది డిసైడ్ చేశారు. ఆత్రేయ రాసిన ‘కళ్యాణ వైభోగమే..’, ‘రాళ్ళలో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..’, ‘ఎంత నేర్చినా..’, వేటూరి రాసిన ‘ఏమని పాడను..’ పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. 1986 ఏప్రిల్ 15న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో చక్కని ప్రేమకథా చిత్రంగా నిలిచింది.
నటరత్న ఎన్.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఒకే టైటిల్‌తో చేసిన ఈ సినిమాకి సంబంధించి మరో విశేషం ఉంది. ఎన్టీఆర్ సీతారామకళ్యాణం చిత్రానికి మొదట ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఇందులోని ఒక పాట, పద్యాన్ని ఆయన కంపోజ్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడు గాలిపెంచల నరసింహారావును సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు. సినిమాలోని మిగతా పాటలు, పద్యాలు ఆయనే స్వరపరిచారు. ఈ సినిమాలోని ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి..’ పాట అత్యంత జనాదరణ పొందింది. సముద్రాల రాసిన ఈ పాటను పి.సుశీల ఎంతో మధురంగా ఆలపించారు. దాదాపు 30 సంవత్సరాలపాటు ఈ పాట లేకుండా పెళ్లి పందిళ్లు ఉండేవి కావు. అంతగా ఈ పాట జనాదరణ పొందింది. పాతిక సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ చేసిన ‘సీతారామకళ్యాణం’ చిత్రంలోని ‘కళ్యాణ వైభోగమే..’ పాటకు కూడా అంతటి ఆదరణ లభించింది. ఆ తర్వాతి కాలంలో ప్రతి పెళ్లిలోనూ ఈ పాట వినిపించేది. అలాగే పెళ్లికి సంబంధించిన వీడియోలో కూడా ఈ పాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలా ఎన్టీఆర్, బాలకృష్ణ తాము చేసిన చిత్రాల ద్వారా తెలుగు వారికి పెళ్లి పాటలు అందించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
