సమంత కెరీర్, పర్సనల్ లైఫ్ అన్ని మలుపులు తిరగడం వెనుక రీజన్ ఇదే!
on Apr 28, 2025
(ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు సందర్భంగా..)
సమంత.. ఓ మెరుపులా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన తార. హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో మంచి సినిమాలు చేసిన సమంత.. నటిగానే కాదు, తను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తను తొలిసారి నటించిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. యంగ్ హీరోల పాలిట వరంగా మారిన సమంత ఒక దశలో అందరు యంగ్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయారు. చిత్ర పరిశ్రమకు వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంత.. తెలుగు, తమిళ్ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వీటిలో తెలుగు సినిమాలే అధికంగా ఉండడం విశేషం. యూత్ ఐకాన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైంది? ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.
1987 ఏప్రిల్ 28న జోసెఫ్ ప్రభు, నినెట్టే దంపతులకు మూడో సంతానంగా చెన్నయ్‌లో జన్మించారు సమంత రూత్ ప్రభు. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.
తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ కాగా, తల్లి మలయాళీ. సమంత స్కూల్, కాలేజీ విద్య అంతా చెన్నయ్‌లోనే కొనసాగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌పై దృష్టి పెట్టారు సమంత. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించారు. అలా సమంత గురించి దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్‌కి తెలిసింది. తను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ద్వారా తొలిసారి సమంతకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. తెలుగులో ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో ఒక్కసారిగా సమంత పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. దాంతో తెలుగులోనే కాదు, తమిళ్‌లోనూ బిజీ హీరోయిన్ అయిపోయారు. ముఖ్యంగా తెలుగులో నాగచైతన్య, మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నితిన్, నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో నటించి ఘనవిజయాలు అందుకున్నారు సమంత. తమిళ్‌లో విజయ్, విక్రమ్, సూర్య వంటి హీరోలతో కలిసి నటించారు.
‘ఏమాయ చేసావె’ తర్వాత తెలుగులో సమంత చేసిన సినిమా ‘బృందావనం’. ఈ సినిమా ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ వంటి సూపర్‌హిట్ సినిమాలు సమంతను స్టార్ హీరోయిన్‌ని చేశాయి. అయితే ఆమె తెలుగు, తమిళ్ చిత్రాల్లో మాత్రమే నటించారు. ‘ఏమాయ చేసావె’ చిత్రాన్ని హిందీలో ‘ఏక్ దివానా తా’ రీమేక్ చేశారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈగ’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించగా, హిందీలోకి ‘మఖ్కీ’ పేరుతో డబ్ చేశారు. 2019 వరకు సమంత కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగింది. ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్2’, ‘సిటాడెల్(హనీ బన్నీ)’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘శుభం’, ‘మా ఇంటి బంగారం’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు సమంత.
సమంత మొదటి సినిమా ‘ఏమాయ చేసావె’ 2010లో రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాలోని జెస్సీ పాత్ర కుర్రకారు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేంతగా తన నటనను ప్రదర్శించారు సమంత. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో నాగచైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. చాలా సంవత్సరాలపాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ రీతిలో గోవాలో నాగచైతన్య, సమంత వివాహం జరిగింది. దీంతో సమంత రూత్‌ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. 4 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితానికి 2021లో స్వస్తి పలికింది ఈ జంట. మొదట జూలై 31న సోషల్ మీడియాలో తన పేరు నుంచి అక్కినేని పేరును తొలగించడం ద్వారా తాము విడిపోతున్నట్టు సూచన ప్రాయంగా తెలియజేశారు సమంత. ఆ తర్వాత అక్టోబర్ 2న తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు నాగచైతన్య, సమంత.
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. మయోసైటిస్ అనేది వ్యాధి బారిన పడడంతో మానసికంగా ఆమె ఎంతో కుంగిపోయారు. తిరిగి మామూలు స్థితికి రావడం కోసం ఎంతో కృషి చేశారు. అమెరికాలో కొన్ని నెలలపాటు చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైంది. అయినప్పటికీ కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోజుల్లోనే ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో నటించారు సమంత. ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడంలో సమంత చూపించిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. సినిమాల్లో నటించడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ సమంత ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎన్నో విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు సమంత.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
