ENGLISH | TELUGU  

ఆ విషయంలో ఎం.ఎస్‌.నారాయణను మించిన వారు ఇండియాలోనే లేరు!

on Apr 16, 2025

(ఏప్రిల్ 16 ఎం.ఎస్.నారాయణ జయంతి సందర్భంగా..)

తెలుగు చిత్ర పరిశ్రమలోని హాస్యనటుల్లో ఎం.ఎస్‌.నారాయణకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరినీ అనుకరించకుండా.. డైలాగ్‌ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణ. నటుడిగా 1994లో కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆయనకు బ్రేక్‌ వచ్చింది 1997లో. అప్పటి నుంచి 17 సంవత్సరాల్లో దాదాపు 700 సినిమాల్లో నటించడం అనేది ఒక అరుదైన రికార్డుగానే చెప్పాలి. అందులో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలు పోషించి మెప్పించడం ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్స్‌ చేసిన నటుడు ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి రచయిత కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ఎం.ఎస్‌.నారాయణ.. ఒక అద్భుతమైన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, నేపథ్యం ఏమిటి? ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటనేది తెలుసుకుందాం.

1951 ఏప్రిల్‌ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు మైలవరపు సూర్యనారాయణ. వీరిది రైతు కుటుంబం అయినప్పటికీ పది మంది సంతానం కావడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. దాంతో కుటుంబంలోని అందరూ పొలం పనులకు వెళ్లేవారు. కానీ, ఎం.ఎస్‌.నారాయణ మాత్రం తాను చదువుకుంటానని పట్టుపట్టారు. అలా తండ్రికి ఇష్టం లేకపోయినా పదో తరగతి వరకు ఇల్లందులో చదువుకున్నారు. ఆ తర్వాత ఫత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో భాషా ప్రవీణ కోర్సు చేశారు. అదే సమయంలో మూర్తిరాజు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశారు. ఎం.ఎస్‌. రచయితగా ఎదిగేందుకు అది దోహదమైంది. భాషా ప్రవీణ కోర్సు పూర్తయిన తర్వాత భీమవరంలోని కెజిఆర్‌ఎల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ రైలెక్కారు. 

అర్జున్‌, భానుచందర్‌ హీరోలుగా సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేగుచుక్క పగటిచుక్క’ చిత్రం కథా రచనలో సహాయకుడిగా పనిచేశారు. ఎం.ఎస్‌.నారాయణ పేరు స్క్రీన్‌పై తొలిసారి కనిపించింది ఈ సినిమాకే. ఆ తర్వాత ప్రయత్నం, హలోగురు, హలో నీకునాకు పెళ్లంట, అలెగ్జాండర్‌, శివనాగ వంటి సినిమాలకు మాటలు రాశారు. 1993లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘పేకాట పాపారావు’ చిత్రానికి జనార్థన మహర్షితో కలిసి కథ అందించారు. ఈ సినిమా ఎం.ఎస్‌.కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ చిత్రానికి కామెడీ ట్రాక్‌ను రాశారు. అలాగే ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘పెదరాయుడు’, ‘రుక్మిణి’ చిత్రాల్లో కూడా ఎం.ఎస్‌.కి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చారు రవిరాజా. అలా ఓ పది సినిమాల్లో నటించిన తర్వాత ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రంలో ఒక తాగుబోతు క్యారెక్టర్‌ ఇచ్చారు ఇ.వి.వి.సత్యనారాయణ.

1997లో విడుదలైన ‘మా నాన్నకి పెళ్లి’ చిత్రంలో ఎం.ఎస్‌.నారాయణ చేసిన క్యారెక్టర్‌.. ఒక అద్భుతమైన కెరీర్‌కి పునాది వేసింది. నటుడిగా ఫుల్‌ బిజీ అయిపోయారు. దాంతో సినిమా రచన పక్కన పెట్టి నటనపైనే దృష్టి కేంద్రీకరించారు. అప్పుడు మొదలు సంవత్సరానికి 15 నుంచి 20 సినిమాల్లో నటిస్తూ వచ్చారు. 2001లో ఏకంగా 50 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 30 సినిమాలకు తక్కువ కాకుండా నటించేవారు. ఒక దశలో ఎం.ఎస్‌.నారాయణ లేని సినిమా రిలీజ్‌ అయ్యేది కాదు. 1997 నుంచి 2015 వరకు 700 సినిమాల్లో నటించారు ఎం.ఎస్‌.నారాయణ. అందులో ఆయన చేసిన సినిమాల గురించి, క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తాగుబోతు క్యారెక్టర్లే కాదు, పేరడీ క్యారెక్టర్స్‌లోనూ ఎం.ఎస్‌.దే పైచేయిగా ఉండేది. దుబాయ్‌ శీను, దూకుడు, డిస్కో వంటి సినిమాల్లో ఆయన చేసిన పేరడీ క్యారెక్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాదు, 5 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు ఎం.ఎస్‌.నారాయణ.

ఎం.ఎస్‌.నారాయణ వ్యక్తిగత జీవిత విషయాల గురించి చెప్పాలంటే.. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తన క్లాస్‌మేట్‌ కళాప్రపూర్ణను ప్రేమించారు. వీరికి పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వివాహం జరిపించారు. ఎం.ఎస్‌., కళాప్రపూర్ణలది కులాంతర వివాహం. వీరికి కుమార్తె శశికిరణ్‌, కుమారుడు విక్రమ్‌ ఉన్నారు. వీరిద్దరికీ సినిమా రంగంలో రాణించాలని ఉంది. శశికిరణ్‌ తన దర్శకత్వంలో ‘సాహెబ్‌ సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని రూపొందించారు. అలాగే విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ‘కొడుకు’ చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎస్‌.నారాయణ. అయితే ఇది పరాజయాన్ని చవిచూసి ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘భజంత్రీలు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కూడా విజయం సాధించలేదు. తను పుట్టి పెరిగిన నిడమర్రు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలనుకున్నారు ఎం.ఎస్‌. దాని కోసం అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్లి అక్కడి పెద్దలతో చర్చించేవారు. అలా 2015 సంక్రాంతికి నిడమర్రు వెళ్లిన ఎం.ఎస్‌. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. కొన్నిరోజులపాటు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి విషమించడంతో జనవరి 23న 63 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు ఎం.ఎస్‌.నారాయణ. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.