అభిమానుల్ని ఏ విధంగానూ బాధపెట్టని ఏకైక హీరో ఎం.జి.ఆర్.!
on Jan 16, 2026
(జనవరి 17 ఎం.జి.ఆర్. జయంతి సందర్భంగా..)
సినిమా తారలకు ప్రజల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరోలకు అభిమానులు, అభిమాన సంఘాలు ఉండడం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. హీరోలు కూడా దానికి తగ్గట్టుగానే అభిమానులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విషయంలో కొందరు హీరోలు ఒక అడుగు ముందుకు వేసి అభిమానుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు కూడా హాజరవుతుంటారు.
తమిళ స్టార్ హీరో ఎం.జి.ఆర్. విషయానికి వస్తే.. అభిమానుల గురించి, ప్రజల గురించి అందరు హీరోల కంటే కాస్త ఎక్కువగానే ఆలోచించేవారు. తన గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు, తన వల్ల అభిమానులకు, ప్రజలకు ఎలాంటి బాధ కలగకకూడదు అనుకునేవారు. అభిమానుల గురించి అంతగా ఆలోచించే హీరో సినిమా ఇండస్ట్రీలో మరొకరు కనిపించరు అంటే అతిశయోక్తి కాదు.
నటరత్న ఎన్.టి.రామారావు తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు భీముడు’. 1964లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా డూయల్ రోల్ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఈ సినిమా స్ఫూర్తితో ఇప్పటివరకు వివిధ భాషల్లో 18 సినిమాలు రూపొందాయి. ఎం.జి.ఆర్. హీరోగా ‘ఎంగ వీట్టు పిళ్లై’ పేరుతో తమిళ్‌లో రీమేక్ చేశారు. ‘రాముడు భీముడు’ చిత్రాన్ని డి.రామానాయుడు నిర్మించగా, ‘ఎంగవీట్టు పిళ్లై’ చిత్రాన్ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించడం విశేషం.
అభిమానుల గురించి ఎంజీఆర్ ఎంత ఆలోచిస్తారు అనే దానికి ఉదాహరణగా ‘ఎంగవీట్టు పిళ్లై’ చిత్రంలోని ఒక సీన్ గురించి చెప్పొచ్చు. సాధారణంగా డూయల్ రోల్ సినిమాలో ఒక హీరో అమాయకంగా ఉంటే, మరో హీరో గడుసుగా ఉంటాడు. ఈ సినిమాలోని ఒక సీన్‌లో గడుసుగా ఉండే హీరో హోటల్‌లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత అమాయకంగా ఉండే హీరో దగ్గర డబ్బు వసూలు చేస్తాడు ఆ హోటల్ యజమాని. సినిమాలో ఈ సీన్ ఎంతో కీలకమైంది. మంచి ఫన్ కూడా ఉంటుంది. ఇదే సీన్ తమిళ్‌లో చేయడానికి ఎంజీఆర్ అభ్యంతరం చెప్పారు.
రైటర్‌ని పిలిచి ‘నేను హోటల్‌లో టిఫిన్ చేసి డబ్బు కట్టకుండా వెళ్లిపోతే.. ఎంజీఆర్ అలా చేస్తాడా అని నా అభిమానులు ఫీల్ అవుతారు. దాన్ని మార్చండి’ అని చెప్పారు. ‘సినిమాలో అదే ముఖ్యమైన సీన్. దాన్ని మారిస్తే చాలా తేడా వస్తుంది’ అన్నారు రైటర్. ‘అయితే హోటల్‌లో టిఫిన్ చేసి డబ్బు కట్టకుండా వచ్చినపుడు నేను ఒక డైలాగ్ చెబుతాను. మీకు ఓకేనా’ అని అడిగారు ఎంజీఆర్. దానికి రైటర్, డైరెక్టర్ తాపీ చాణక్య కూడా ఓకే చెప్పారు. ‘నేను టిఫిన్ చేసి డబ్బు ఇవ్వలేదు. కష్టపడి డబ్బు సంపాదించి ఎప్పటికైనా ఆ బిల్ కట్టేస్తాను’ అనే డైలాగ్ చెప్పారు ఎంజీఆర్.
అభిమానుల గురించి అంతగా ఆలోచించే ఏకైక హీరో ఎంజీఆర్. అభిమానుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. 1971లో ‘రిక్షాకారన్’ అనే సినిమా చేశారు ఎంజీఆర్. ఆ సినిమా విజయం సాధించిన సందర్భంగా మద్రాస్‌లో ఉన్న రిక్షా కార్మికులందరికీ స్వెట్టర్లు అందజేశారు. సాధారణంగా ఒక హీరోని అభిమాని కలవడం అంత సులభం కాదు. కానీ, అభిమానులెవరైనా, ఎప్పుడైనా తనను కలవొచ్చు అని చెప్పేవారు ఎంజీఆర్. ఆయన చెప్పినట్టుగానే ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా అభిమానుల్ని కలిసేవారు. ప్రజల గురించి, అభిమానుల గురించి అంతగా ఆలోచించేవారు కాబట్టే ఎంజీఆర్ ప్రజలు మెచ్చిన నాయకుడయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



