నాగభూషణంపై ఉన్న గౌరవంతో సూపర్‌స్టార్ కృష్ణ ఎలాంటి సాయం చేశారో తెలుసా?
on Feb 3, 2025
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల పాలిట దేవుడుగా చెప్పుకునే హీరో సూపర్‌స్టార్ కృష్ణ. తన సహ నటీనటుల పట్ల, తనతో సినిమాలు తీసే నిర్మాతల పట్ల ఆయన వ్యవహారశైలి గురించి చిత్ర పరిశ్రమలో తెలియనివారు లేరు. నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరోల్లో మొదటి స్థానం కృష్ణదే అని చెప్పాలి. తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతలను ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. 5 దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగిన కృష్ణ.. తన కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు. అందులో కృష్ణకు పారితోషికం పరంగా బకాయి పడ్డ నిర్మాతలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంతేకాదు, తన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తన సీనియర్ నటీనటులంటే కృష్ణకు ఎంత గౌరవభావం ఉంటుందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా నటుడు, నిర్మాత నాగభూషణం జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలనీకి కొత్త అర్థం చెప్పిన నటుడు నాగభూషణం. ఆయన డైలాగ్ చెప్పే విధానంగానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ తెలుగులో మరే ఇతర నటుడికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. నాగభూషణం అంటే కృష్ణకు వల్లమాలిన అభిమానం. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించిన నాగభూషణం ప్రజా నాయకుడు సినిమా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాగభూషణం ప్రధాన పాత్ర పోషించారు. ఆయనపై ఉన్న అభిమానంతో కాంతారావు, జగ్గయ్య, షావుకారు జానకి వంటి నటీనటులు సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో నాగభూషణం నటించారు. ప్రధాన పాత్ర తనదే అయినప్పటికీ, ఒక యంగ్ హీరో ఉంటే బాగుంటుందనిపించి ఎంతో మంది హీరోలను సంప్రదించారు. కానీ, నాగభూషణం ప్రధాన పాత్ర కావడంతో ఆ సినిమాలో నటించేందుకు ఎవరూ అంగీకరించలేదు. దాంతో చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు.
ప్రజానాయకుడు సినిమా గురించి హీరో కృష్ణకు తెలిసింది. వెంటనే నాగభూషణంకు ఫోన్ చేసి ‘మీ సినిమాలో హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది. మీరెందుకు అంత బాధపడతారు. నేను మీ సినిమాలో నటిస్తాను. మీరు ఎనౌన్స్ చేసుకోండి. నాకు ఇచ్చే పారితోషికం గురించి ఆలోచించకండి. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. సినిమా స్టార్ట్ చెయ్యండి’ అని ఆయనకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఈ సినిమా 1972 నవంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. అంతేకాదు, తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా ఈ చిత్రానికి లభించింది. అప్పటికే మోసగాళ్ళకు మోసగాడు, గూడుపుఠాణి, పండంటి కాపురం వంటి సూపర్‌హిట్ సినిమాలు చేసి హీరోగా బిజీగా ఉన్న సమయంలో నాగభూషణం కోసం ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం కృష్ణ గొప్ప మనసును తెలియజేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాగభూషణం స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
