సుమధుర స్వరాల సృష్టికర్త రమేష్ నాయుడు మన రాష్ట్రానికీ, మన భాషకీ, మన సంగీతానికీ దేశ స్థాయిలో సంగీత దర్శకునిగా పురస్కారం అందుకుని గుర్తింపు తెచ్చినందుకు, అదీ మొట్టమొదటి జాతీయ పురస్కారం అందుకున్న తెలుగు సంగీత దర్శకుడు అయినందుకు, మరీ ముఖ్యంగా ఒక తెలుగు వాడు మొట్టమొదటి సారిగా 12 భాషలలో సంగీత దర్శకత్వం వహించినందుకు, అంతకంటే ముఖ్యంగా నాటి నేపాల్ మహరాజు, రమేష్ నాయుడు స్వరపరచిన బెంగాలీ పాటలు విని, నేపాలీ సినిమాకి సంగీతం సమకూర్చమని అడిగినందుకూ.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రమేష్ నాయుడు పుట్టింది ఒక కుగ్రామం కొండపల్లిలో, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి, మేన బావ రామమూర్తి వద్ద బందరు హైస్కూల్లో చేరి, చదువుకుంటున్న రోజుల్లో సినిమాలు చూసి, వాటి ప్రభావంతో గాయకుడు కావాలనుకుని ఇంటి నుంచి బొంబాయి పారిపోయి, 16 సంవత్సరాల వయసులో సంగీత దర్శకుడు అవడం ఎంత యాదృచ్ఛికమో, 1973లో గాయకుడు అవడం కూడా అంత యాదృచ్ఛికమే!
"చందన" సినిమాకి సహాయ దర్శకునిగా చేస్తున్న సందర్భంలో జరిగిన సంఘటనకి నేను ప్రత్యక్ష సాక్షని. ఒక సన్నివేశం నేపథ్యంలో సాగే "ఓ రామచక్కని బంగారు బొమ్మా" అనే పాటని సి.నారాయణరెడ్డిగారు రాయగా, రమేష్ నాయుడుగారు స్వరపరచి, మద్రాసు సీ.ఐ.టి నగర్‌లో ఉన్న మా ఆఫీసులో ఘంటసాలగారితో రిహార్సల్స్ చేయించారు. ఆ పాటని కాపీ చేసి, ఘంటసాలగారికి అందించే భాగ్యం ఆరోజు నాకు కలిగింది (ఘంటసాల గారిని మొదటిసారి, చివరిసారిగా నేను చూసింది అప్పుడే). మరునాడు రికార్డింగ్‌కి రావలసిన ఘంటసాల గారు అనారోగ్యంతో విజయ హాస్పటల్‌లో చేరడంతో, ఉన్న ఫళంగా ట్రాక్ సింగర్స్ దొరక్కపోవడంతో రమేష్ నాయుడు గారే ఆ పాట పాడటం జరిగింది.
చివరికి ఘంటసాలగారు పాడలేని స్థితిలో ఉన్నారని తెలిసి, రామకృష్ణగారితో పాడించాలని నిర్ణయించినప్పుడు, ఆ సమయంలో జెమిని రికార్డింగ్ థియేటర్‌కి వచ్చిన తారకరామ పంపిణీ దారులు సీతారామారావుగారు, రాఘవేంద్రరావుగారు "మీ వాయిస్‌లో కొత్తదనం ఉంది. మీరే పాడాల"ని పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో ఆ పాటని రమేష్ నాయుడు పాడటం జరిగింది. ఆ పాట హిట్టయ్యింది, కానీ సినిమా దారుణమైన ఫ్లాప్ అయ్యింది. ఆ పాట విన్న దాసరి నారాయణరావుగారు "రాధమ్మ పెళ్లి", "చిల్లర కొట్టు చిట్టెమ్మ" సినిమాలలో కూడా బలవంతంగా పాడించారు. రమేష్ నాయుడుగారు సంగీత దర్శకుడు అయిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత అనుకోకుండా గాయకుడు అవాలనే కోరిక నెరవేరడమే కాకుండా, "చిల్లర కొట్టు చిట్టెమ్మ" సినిమాకి గాయకునిగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు.
ఇవన్నీ రమేష్‌నాయుడుగారి ప్రత్యేకతలైతే, మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాకి, ఆనాటి ప్రముఖ గాయకుడు, ఘజల్ సింగర్ తలత్ మహమూద్‌ని పరిచయం చెయ్యడం మరో ప్రత్యేకత. అప్పట్లో హిందీ సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉండే తలత్ మహమూద్, రమేష్ నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మూడు రోజులు ముందుగానే "మనోరమ" అనే సినిమా కోసం మద్రాసు వచ్చి, తెలుగు పదాలని స్వరబద్దంగా నేర్చుకుని పాడటం నిజంగా విశేషం. ఆ సినిమాలోని పాటలన్నీ నాటికీ - నేటికీ ఎంతో ప్రజాదరణ పొందినవే!
తెలుగు పరిశ్రమకి రెండున్నర దశాబ్దాల పాటు దూరంగా ఉన్నా, తెలుగు నుడి కారాన్నీ, తెలుగు జానపదాన్నీ మర్చిపోకుండా, సందర్భానుసారంగా, అతి మధురంగా పాటలకి సంగీతాన్ని స్వరపరచి, తను దివికేగి, ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలని భువిలో అందరి మదిలో నిలిపిన రమేష్ నాయుడుగారికి నివాళులు అర్పిస్తూ, వారి జ్ఞాపకంగా "మనోరమ" సినిమా రికార్డింగ్ సందర్భంగా తలత్ మహమూద్, రమేష్ నాయుడుగారు దిగిన ఫైల్ ఫొటో!
Courtesy: Sri P.S.Narayana




