
-ఒకటి కాదు రెండు కాదు 1400 సినిమాలు
-వయసుతో తారతమ్యం లేకుండా భారీ ఫ్యాన్ బేస్ సొంతం
-సంతోషాలని, మోసాలని సమపాళ్లలో చూసింది
-చెన్నైలో కోట్ల విలువైన ఆస్తులు
-కానీ ఇప్పుడు చిత్తూరు జిల్లా మదనపల్లె లో ప్రశాంత జీవితం
తెలుగు సినిమా ఎంతో మంది లెజండ్రీ నటీమణులని అందించి పుణ్యం కట్టుకుంది. అలాంటి వాళ్ళల్లో రమాప్రభ(Rama Prabha)ఒకరు. ఆరు దశాబ్దాలపై నుంచి ఇండస్ట్రీలో ఉంటూ మూడు తరాల సినీ విశ్వాన్ని చూసిన నటీమణి. ఏ క్యారక్టర్ కైనా సూటవ్వడమే కాకుండా విలక్షణమైన డైలాగ్ డెలివరీ తో రఫ్ఫాడిస్తుంది.
1966లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రమాప్రభ దాదాపు 1400 కి పైగా సినిమాల్లో తనదైన హవా కొనసాగించి మెప్పించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ బిజీగా ఉంటూ, హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరికొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా 1970, 1980వ దశకాల్లో హాస్య నటుడు రాజబాబుతో ఆమె కట్టిన జంట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే వెండితెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే రమాప్రభ నిజ జీవితం వెనుక ఎన్నో గుండె కోతలు, మోసాలు, ఆర్థిక కష్టాలు దాగి ఉన్నాయన్నది చేదు నిజం.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రమాప్రభ సంపాదన కోట్లలో ఉండేది. మద్రాసు (చెన్నై) నడిబొడ్డున ఎంతో విలువైన స్థలాలు, బంగళాలు ఆమె సొంతం. ఆ సమయంలోనే నటుడు శరత్ బాబు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. 1974లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం చివరకు 1988లో తీవ్రమైన విభేదాలు, విడాకులతో ముగిసింది. ఈ క్రమంలోనే చెన్నై ఆల్వార్‌పేట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులన్నీ చేజారిపోయాయి.
ఒకప్పుడు వందల మందికి అన్నం పెట్టిన ఈ సీనియర్ నటి, ఆస్తులన్నీ కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు. ఆ మధ్య కాలంలో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, దీన స్థితిలో తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే వాటన్నింటినీ రమాప్రభ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరిపైనా ఆధారపడకుండా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని స్పష్టం చేశారు.
ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే, రమాప్రభ తన సోదరి కుమార్తె అయిన విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకున్నారు. ఈ విజయ చాముండేశ్వరి మరెవరో కాదు, టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, 'నటకిరీటి' రాజేంద్ర ప్రసాద్ భార్య. ఈ రకంగా రాజేంద్ర ప్రసాద్ రమాప్రభకు స్వయానా అల్లుడు అవుతారు. నేటికీ పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వంటి నటుల వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను ఆమె ఎంతో అభినందిస్తూ ఉంటారు. సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాలకు,ఆస్తుల నష్టానికి రమాప్రభ జీవితం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
రమాప్రభ అసలు పేరు రమాదేవి. ఆమె పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. నిర్మాతగా కూడా ‘గాంధీనగర్ రెండవ వీధి’, ‘అప్పుల అప్పారావు’, ‘వింత ఇల్లు సంతగోల’ వంటి చిత్రాలను నిర్మించింది. అయ్యప్పమాల ధరించిన తొలి తెలుగు నటి రమాప్రభే కావడం విశేషం. ఏది ఏమైనా ఆమె జీవిత కథ కూడా ఒక సినిమా కథే.
ramaprabha, sarathbabu, rajendraprasad




