- మొదట అనుకున్న హీరో ఎవరు?
- తొలి 200 రోజుల సినిమా
- రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమా
- అప్పటికి హై బడ్జెట్ సినిమా
1949లో వచ్చిన ‘మనదేశం’ చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ‘పాతాళభైరవి’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరోగా అవతరించారు. అప్పటివరకు జానపద హీరో అంటే అక్కినేని పేరే వినిపించేది. కీలుగుర్రం, బాలరాజు వంటి సూపర్‌హిట్ సినిమాలతో ఎఎన్నార్ తిరుగులేని జానపద హీరో అనిపించుకున్నారు. ఎప్ప్పుడైతే ‘పాతాళభైరవి’ రిలీజ్ అయిందో.. ఎఎన్నార్ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్‌తో తను ఏ విధంగానూ పోటీ పడలేనని గ్రహించారు. అప్పటి నుంచి తన పంథా మార్చుకొని సాంఘిక చిత్రాల వైపు మళ్ళారు. వాటిలో కూడా భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను మలుచుకున్నారు ఎఎన్నార్.
1951 మార్చి 15న ‘పాతాళభైరవి’ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15తో ఈ సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి అంకురారప్పణ ఎలా జరిగింది? ఎన్టీఆర్ ఈ సినిమాలోకి హీరోగా ఎలా వచ్చారు? విజయ సంస్థకు ఈ తరహాలో ఒక సినిమా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ కథను ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎవరు? మాంత్రికుడి పాత్ర కోసం మొదట ఎవరిని అనుకున్నారు? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితం లభించింది? సినిమా గురించి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? వంటి విశేషాల గురించి తెలుసుకుందాం.
చిత్ర నిర్మాణం చేపట్టిన తర్వాత విజయ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా ‘షావుకారు’. టైటిల్ రోల్‌ను జానకి పోషించారు. ఈ సినిమా నుంచి ఆమె పేరు షావుకారు జానకిగా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమాలోని మరో కీలక పాత్ర సున్నపు రంగ క్యారెక్టర్‌ను ఎస్.వి.రంగారావు పోషించారు. ఈ సినిమా విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది తప్ప లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో తర్వాత ఏ సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారు విజయ అధినేతలు.
విజయకు అనుబంధ సంస్థ అయిన వాహినిలో భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డితో రెండో సినిమా చెయ్యాలనుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. రచయితగా పింగళి నాగేంద్రరావును ఎంపిక చేశారు. అల్లావుద్దీన్ అండ్ ది పవర్‌ఫుల్ ల్యాంప్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కాశీ మజిలీ తరహాలో ‘పాతాళభైరవి’ కథను సిద్ధం చేశారు పింగళి. ఒక సామాన్యుడు రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ అందరికీ నచ్చింది. నాలుగు నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ, మాటలు పింగళి రాయగా, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు.
‘షావుకారు’ చిత్రానికి పనిచేసిన మార్కస్ బార్‌ట్లేను ‘పాతాళభైరవి’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. తమ ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాలతో 10 పాటలు రికార్డ్ చేయించారు. ఇక తారాగణం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎఎన్నార్‌ను తోట రాముడిగా, ముక్కామలను నేపాళ మాంత్రికుడిగా తీసుకోవాలని కె.వి.రెడ్డి అనుకున్నారు. అయితే విజయ అధినేతలు మాత్రం షావుకారులో నటించిన ఎన్టీఆర్ అయితే బాగుంటాడు అని సూచించారు.
‘షావుకారు’ తర్వాత ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది విజయ సంస్థ. దాని ప్రకారం నెలకు రూ.250 జీతం ఇస్తారు. సినిమా ఉన్నా లేకున్నా స్టూడియోకి వచ్చి కూర్చోవాలి. సినిమా చేస్తే.. నెల జీతం కాకుండా సినిమాకి రూ.5000 పారితోషికం ఇస్తారు. అంతేకాదు, అగ్రిమెంట్ కాలంలో బయటి సంస్థలకు సినిమాలు చేయకూడదు. తప్పనిసరి అయితే వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షరతులన్నింటికీ ఒప్ప్పుకొని ఎన్టీఆర్ సంతకం చేశారు. విజయ సంస్థతో ఎన్టీఆర్‌కి అగ్రిమెంట్ ఉండడంతో పాతాళభైరవిలో హీరోగా అతన్నే తీసుకోవాలని నాగిరెడ్డి, చక్రపాణి అనుకున్నారు. కానీ, దర్శకుడు కె.వి.రెడ్డి ఆలోచన మాత్రం వేరుగా ఉంది.
ఇదిలా ఉంటే.. ‘మాయలమారి’ చిత్రంలో గండరగండ పాత్ర పోషించిన వై.రాజారెడ్డిని హీరోగా అనుకొని మేకప్ టెస్ట్ చేశారు. ఈ విషయం అన్ని పత్రికల్లో ప్రచురించారు కూడా. ‘పాతాళభైరవి’ చిత్రంలో ఎంతో పాపులర్ అయిన ‘నిజం చెప్పమంటారా.. అబద్ధం చెప్పమంటారా’ అనే డైలాగ్‌తో రిహార్సల్స్ మొదలు పెట్టారు. అయితే రాజారెడ్డికి కొంచెం నత్తి ఉండడంతో డైలాగులు చెప్పడంలో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. ఆ సమయంలోనే ఒకరోజు వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఎఎన్నార్ టెన్నిస్ ఆడుతున్నారు. ఎన్టీఆర్ రాకెట్ పట్టుకొని కొట్టే విధానం కె.వి.రెడ్డికి బాగా నచ్చింది. దాంతో తోట రాముడు క్యారెక్టర్‌కు ఎన్టీఆర్ బెటర్ ఛాయిస్ అనుకున్నారు. అలాగే నేపాళ మాంత్రికుడి పాత్ర కోసం ‘షావుకారు’ చిత్రంలో సున్నపు రంగ పాత్ర పోషించిన ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు. ‘భక్తపోతన’ చిత్రంలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని హీరోయిన్‌గా, అంజిగాడు పాత్రకు వల్లూరి బాలకష్ణను తీసుకున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే హై బడ్జెట్ సినిమా. 1950 ఫిబ్రవరి 5న ‘పాతాళభైరవి’ షూటింగ్ ప్రారంభమైంది. 1951 ఫిబ్రవరి 8 వరకు అంటే సంవత్సరంపాటు ఈ చిత్ర నిర్మాణం జరిగింది. మాయా మహల్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాట్యం తెలిసిన ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది. అప్ప్పుడు సావిత్రి గురించి తెలిసి ఆమెను పిలిపించి ‘రానంటే రానే రానోయ్..’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. మహానటి సావిత్రి తొలిసారి వెండితెరపై కనిపించిన సినిమా ఇదే. ఈ పాటలో ఆమెతోపాటు నత్య దర్శకుడు పసుమర్తి కష్ణమూర్తి నర్తించారు.
1951 మార్చి 15న ‘పాతాళభైరవి’ చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్‌ను 1951 మే 17న విడుదల చేశారు. మొదటి మూడు వారాలు ఏవరేజ్ అనే టాక్ తెచ్చుకొని ఆ తర్వాత పెద్ద విజయం సాధించి చరిత్ర సష్టించింది. ఎన్టీఆర్‌ను మాస్ హీరోను చేసింది. 200 రోజులు ప్రదర్శింపబడిన తొలి చిత్రంగా, 25 వారాలు డైరెక్ట్‌గా ప్రదర్శితమైన తొలి రజతోత్సవ చిత్రంగా ‘పాతాళభైరవి’ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ఎఎన్నార్ నటించిన ‘బాలరాజు’ చిత్రాన్ని కూడా 25 వారాలు ప్రదర్శించారు. అయితే డైరెక్ట్‌గా కాకుండా షిఫ్టులవారీగా ప్రదర్శన జరిగింది. 1952లో తొలిసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం భారతదేశంలో జరిగింది. ఇందులో ప్రదర్శించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘పాతాళభైరవి’. సినిమా ఘనవిజయం సాధించడంతో విజయ సంస్థ సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింత విస్తరించారు.
‘పాతాళభైరవి’ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సినిమా. అప్పటికి ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఆయన్ని మాస్ హీరోని చేసింది. జానపద హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సంపాదించి పెట్టింది. నేపాల మాంత్రికుడిగా ఎస్వీఆర్ ప్రదర్శించి నటుడిగా ఎంతో బిజీ అయిపోయారు. ఈ సినిమాలోనే తొలిసారి సావిత్రి తెరపై కనిపించారు. అంజిగాడుగా వల్లూరి బాలకష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన పేరు అంజిగాడుగా స్థిరపడిపోయింది. సదాజపుడిగా నటించిన పద్మనాభం ఈ సినిమా తర్వాతే బిజీ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాల్లో నటించినప్పటికీ ‘పాతాళబైరవి’ మాత్రం ఆయన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.





