ఒక్క రాత్రిలో పాటలన్నీ ట్యూన్ చేసిన చక్రవర్తి.. ఆ సినిమా గోల్డెన్ జూబ్లీ అయింది!
on Feb 3, 2025
(ఫిబ్రవరి 3.. సంగీత దర్శకుడు చక్రవర్తి వర్థంతి సందర్భంగా..)
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ స్వరాలతో ప్రేక్షకులను, శ్రోతలను అలరించారు. అయితే వారందరిలోనూ చక్రవర్తిది ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పొచ్చు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తన సంగీతంతో తెలుగు చిత్ర పరిశ్రమను శాసించారు. 1971 నుంచి 1989 వరకు స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు తన బాణీలతో మ్యూజికల్ హిట్స్ అందించారు. 70వ దశకంలో దాదాపు అన్ని సినిమాలూ చక్రవర్తే చేశారా అన్నంతగా పేరు మారు మోగిపోయింది. 1995లో వచ్చిన అమ్మోరు.. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా. 25 సంవత్సరాల కెరీర్‌లో 960 సినిమాలకు సంగీతం అందించారు చక్రవర్తి. కమర్షియల్ సినిమాలకు, ప్రేమకథా చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు మ్యూజిక్ చెయ్యడంలో ఓ ప్రత్యేకమైన శైలిని కలిగిన చక్రవర్తి సినీ కెరీర్ ఎలా మొదలైంది, ఆయన సినీ జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. 1936 సెప్టెంబర్ 8న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో బసవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. చక్రవర్తి ప్రాథమిక విద్య పొన్నెకల్లులో, డిగ్రీ గుంటూరు హిందు కాలేజీలో చదివారు. తండ్రి రంగస్థల కళాకారుడు, తల్లి మంచి గాయని. ఆమె ప్రభావం చక్రవర్తిపై ఉండడంతో సంగీతంపై ఆసక్తి కలిగింది. అది గమనించిన తండ్రి అతనికి శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆ తర్వాత వినోద్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు చక్రవర్తి. అలాగే విజయవాడ రేడియో స్టేషన్‌లో 1954, 1958 మధ్య ఆయన పాడిన పాటలు వినిపించేవి. 1958లో డిగ్రీ పూర్తి చేశారు. అయినా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా సంగీతాన్నే నమ్ముకున్నారు. అదే ఏడాది తన మేనమామ కుమార్తె రోహిణీదేవిని వివాహం చేసుకొని మద్రాస్ చేరుకున్నారు.
ప్రారంభంలో చక్రవర్తికి గాయకుడిగా అవకాశాలు వచ్చాయి. ఆయన మొదట కన్నడ సినిమాలో పాట పాడారు. ఆ తర్వాత బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన జయవిజయ చిత్రంలో రెండు పాటలు పాడారు. అలా పది సంవత్సరాలపాటు సింగర్‌గానే కొనసాగారు. ఓ పక్క పాటలు పాడుతూనే కంచుకోట, పెత్తందార్లు, నిలువు దోపిడీ, దేశోద్ధారకుడు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో డబ్బింగ్ కూడా చెప్పేవారు. తమిళ నటులు ఎంజిఆర్, శివాజీగణేశన్, నగేష్, హిందీ నటులు రాజ్‌కుమార్, సంజీవ్‌కుమార్ వంటి వారికి తెలుగులో గాత్రదానం చేసేవారు. ఆయన కెరీర్ మొత్తంలో 600 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. 1970 ప్రాంతంలో చక్రవర్తిలోని సంగీత జ్ఞానాన్ని పసిగట్టిన నిర్మాత చటర్జీ.. తను నిర్మిస్తున్న మూగప్రేమ చిత్రానికి సంగీతాన్ని అందించే బాధ్యతను అప్పగిస్తూ అప్పారావు పేరును చక్రవర్తిగా మార్చారు. 1971లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శారద చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించారు చక్రవర్తి. ఆ తర్వాత వరసగా బాబు, అన్నదమ్ముల అనుబంధం, ఇదాలోకం, చీకటి వెలుగులు బలిపీఠం, జేబుదొంగ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు.
1977లో దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ సినిమా యమగోలలోని పాటలు సంగీత దర్శకుడుగా చక్రవర్తిని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అప్పటికే బిజీగా ఉన్న ఆయన్ని తీరిక లేని మ్యూజిక్ డైరెక్టర్‌ని చేశాయి. ఓ పక్క సినిమాలకు సంగీతం చేస్తూనే చాలా సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న చిన్నా పెద్దా హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ చేశారు చక్రవర్తి. ఎలాంటి పాటనైనా నిమిషాల్లో ట్యూన్ చెయ్యడం ఆయనలోని ప్రత్యేకత. అక్కినేని, శ్రీదేవి జంటగా నటించిన ప్రేమాభిషేకం చిత్రంలోని అన్ని పాటల్ని ఒక్క రాత్రిలోనే ట్యూన్ చేశారంటే చక్రవర్తి వర్క్ ఎంత స్పీడ్‌గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1976-89 మధ్యకాలంలో యమగోల, డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌చౌదరి, మల్లెపూవు, పదహారేళ్ళ వయసు వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారు. కమర్షియల్ చిత్రాలకే కాకుండా ఎర్రమల్లెలు, విప్లవశంఖం, ప్రజారాజ్యం, మహాప్రస్థానం. నేటిభారతం, వందేమాతరం, రేపటి పౌరులు వంటి అభ్యుదయ చిత్రాలకు సైతం సూపర్‌హిట్ సాంగ్స్ చేశారు. 1989లో 95 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో 66 సినిమాలకు చక్రవర్తి సంగీతం చెయ్యడం ఒక ప్రపంచ రికార్డుగా చెప్పొచ్చు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చక్రవర్తి ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా నేటిభారతం, శ్రావణ మేఘాలు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో శ్రీగా పిలవబడే శ్రీనివాస చక్రవర్తి కూడా చాలా సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత చిన్న వయసులోనే ఆయన మరణించారు. 1995లో విడుదలైన అమ్మోరు తర్వాత అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు చక్రవర్తి. చివరికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2002 ఫిబ్రవరి 3న తుదిశ్వాస విడిచారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
