Home

»

Featured News

ఎల్.వి.ప్రసాద్ సినీ ప్రస్థానం: వంద రూపాయలతో బొంబాయి చేరి.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు!

Jun 22, 2026 12:45PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ తొలి తరం వేగుచుక్క, సినీ దిగ్గజం అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు అలియాస్ ఎల్.వి.ప్రసాద్ (LV Prasad) వర్ధంతి నేడు (జూన్ 22). తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ముద్ర అజరామరం. 1908 జనవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో జన్మించిన ప్రసాద్, చదువుకన్నా నాటకాలు, కదిలే బొమ్మల పైనే ఎక్కువ ఆసక్తి పెంచుకున్నారు. 17 ఏళ్ల చిన్న వయసులోనే 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను వివాహం చేసుకున్న ఆయన, కుటుంబ ఆర్థిక కష్టాల వల్ల 1930లో జేబులో కేవలం 100 రూపాయలతో ఎవరికీ చెప్పకుండా సినీ మాయానగరి బొంబాయికి రైలెక్కారు.

బొంబాయి చేరిన కొత్తలో వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు కేవలం 15 రూపాయల వేతనంతో చిన్న పనులు చేసే అసిస్టెంట్‌గా ఆయన జీవితం ప్రారంభమైంది. అయితే, భారత సినీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన రికార్డు ఎల్.వి.ప్రసాద్ సొంతమైంది. భారతదేశపు మొట్టమొదటి హిందీ టాకీ చిత్రం 'ఆలం ఆరా' (1931), మొదటి తమిళ టాకీ 'కాళిదాస్' (1931), తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' (1931) — ఈ మూడు చారిత్రాత్మక తొలి టాకీ సినిమాలలోనూ నటించిన ఏకైక నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అవకాశాలు లేని కష్టకాలంలో జీవనోపాధి కోసం డ్రీమ్‌లాండ్ సినిమా హాల్‌లో గేట్‌కీపర్‌గా రాత్రి వేళల్లో పని చేస్తూనే, పగటిపూట 'సతీ సావిత్రి' సినిమాలో నటించిన అద్భుతమైన పట్టుదల ఆయనది.

ఆ తర్వాత మద్రాసు పయనమైన ఎల్.వి.ప్రసాద్, 1946లో విడుదలైన 'గృహ ప్రవేశం' సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా, హీరోగా మారి ఇండస్ట్రీని మలుపు తిప్పారు. ఆ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. గూడవల్లి రామబ్రహ్మం అనారోగ్యంతో మధ్యలో ఆగిపోయిన 'పల్నాటి యుద్ధం' (1947) చిత్ర బాధ్యతలను భుజాన వేసుకుని అఖండ విజయాన్ని అందించారు. 

దర్శకుడిగా ఆయన విజయం ఎంతటిదంటే, 1949లో 'మన దేశం' సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర సామ్రాట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావును వెండితెరకు పరిచయం చేసింది ఎల్.వి.ప్రసాదే. ఆ తర్వాత విజయ పిక్చర్స్ వారి మొదటి చిత్రం 'షావుకారు' (1950), ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి నటించిన 'సంసారం' (1950) చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ముఖ్యంగా 1955లో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిస్సమ్మ' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 100 రోజులు పూర్తి చేసుకుని ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని హిందీలో 'మిస్ మేరీ'గా రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ సంచలన దర్శకుడిగా మారారు. నిర్మాతగా ఆయన నిర్మించిన 'మిలన్' (1964) చిత్రం ఏకంగా 175 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మద్రాసులో 'ప్రసాద్ స్టూడియో', హైదరాబాద్‌లో అత్యంత ఆధునిక 'ప్రసాద్ ఫిలిం లాబొరేటరీ', ప్రసాద్ మల్టిప్లెక్స్ మాల్ స్థాపించి సినిమా రంగానికి సాంకేతిక జవజీవాలు ఇచ్చారు. 'సర్వేంద్రియాణాం నయనం ప్రదానం' అనే సూక్తితో 1987లో బంజారాహిల్స్‌లో స్థాపించిన 'ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి' నేటికీ లక్షలాది మంది పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి నేత్ర వైద్యం అందిస్తూ ఆయన సేవాతత్పరతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. 

చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గాను 1980లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1982లో భారత సినీ రంగ అత్యున్నత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' డాక్టరేట్ లభించాయి. 1994 జూన్ 22న తన 82 ఏళ్ల వయసులో ఎల్.వి.ప్రసాద్ కన్నుమూశారు. ఆయన స్మారకార్థం 2006 సెప్టెంబరు 5న భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. లక్ష్మీవరప్రసాదరావుగా మొదలై ఎల్.వి.ప్రసాద్‌గా మారిన ఆ పేరు భారతీయ సినిమా ఉన్నంతవరకు చిరస్మరణీయం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com