Home

»

Featured News

టాలీవుడ్‌లో గ్రాఫిక్స్ విప్లవం: కోడి రామకృష్ణ సృష్టించిన వండర్స్ ఇవే.!

Jul 22, 2026 7:31PM

(జూలై 23 కోడి రామ‌కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా..)

తెలుగు చిత్ర సీమలో ఏ ఒక్క జోనర్‌కో పరిమితం కాకుండా, ప్రయోగాలకు ప్రాణం పోస్తూ శతాధిక చిత్రాలను అందించిన అరుదైన దర్శకరత్నం కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి చరిత్ర సృష్టించారు. 1949 జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ, ప్రతి రెండేళ్లకు ఒకసారి తన రూట్ మార్చుకుంటూ కుటుంబ కథా చిత్రాలు, పొలిటికల్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు, గ్రాఫిక్స్ విశ్వరూపాలు చూపిస్తూ దాదాపు 30 సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు.

ఆయన కెరీర్ ప్రారంభంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దాసరి నారాయణరావు మద్రాస్‌లో అడుగుపెట్టిన రోజే మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చినట్లే, కోడి రామకృష్ణ కూడా మద్రాస్ వచ్చిన తొలి రోజే కె.రాఘవ నిర్మిస్తున్న 'చదువు సంస్కారం' చిత్రంలో స్టూడెంట్ రౌడీ పాత్రలో న‌టించారు. ఆ తర్వాత అదే కె.రాఘవ నిర్మాణంలో 1982లో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే సంచలన విజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'తరంగిణి', 'ఆలయ శిఖరం', 'ముక్కుపుడక' వంటి చిత్రాలు ఆయన సత్తాను చాటాయి. ఇక 1984లో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'మంగమ్మగారి మనవడు' చిత్రం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని జరుపుకుని కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను తిరగరాసింది.

తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ రుచి చూపించిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భాగస్వామ్యంతో సౌందర్య ప్రధాన పాత్రలో 1992లో ప్రారంభమై, గ్రాఫిక్స్ పనుల కారణంగా 1995లో విడుదలైన 'అమ్మోరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి గ్రాఫిక్స్‌తో వచ్చిన 'దేవి' బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, అంజి, దేవిపుత్రుడు వంటి భారీ బడ్జెట్ ప్రయోగాలు విజువల్ వండర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత 2009లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన 'అరుంధతి' చిత్రం కోడి రామకృష్ణ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, అనుష్కను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది.

కేవలం కథలే కాదు, విలక్షణమైన విలన్లను పరిచయం చేయడంలోనూ ఆయన స్టైలే వేరు. రచయిత గొల్లపూడి మారుతీరావును 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో విలన్‌గా మార్చడమే కాకుండా, 'అంకుశం'లో నీలకంఠం పాత్రతో రామిరెడ్డిని, 'భారత్ బంద్' చిత్రంతో కాస్ట్యూమ్ కృష్ణను, 'అరుంధతి'లో పశుపతి పాత్రతో సోనూ సూద్‌ను ఇండస్ట్రీకి అందించారు. సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఎన్నో నంది, ఫిలింఫేర్ అవార్డులను పొందిన ఈ మహానటుడు, దర్శకుడు అనారోగ్య కారణాలతో 2019 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన లేకపోయినా, ఆయన అందించిన దృశ్యకావ్యాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

 

 

Kodi Ramakrishna, Tollywood Directors, Kodi Ramakrishna Biography

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com