60 ఏళ్లుగా తన గాన మాధుర్యంతో అలరిస్తున్న సంగీత జ్ఞాని కె.జె.ఏసుదాస్!
on Jan 10, 2025
(జనవరి 10 గాన గంధర్వుడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు సందర్భంగా..)
భారతదేశంలో ఆణిముత్యాల్లాంటి ప్రతిభావంతులు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరచి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పారు. అలా సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాట వేసుకొని తనకు తనే సాటి అనిపించుకున్న మధుర గాయకుడు కె.జె.ఏసుదాస్. భారతదేశానికి లభించిన వెలకట్టలేని అరుదైన ఆణిముత్యం ఆయన. తన గానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయగల అద్భుతమైన నైపుణ్యం జేసుదాస్‌లో ఉంది. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని తన గాన మాధుర్యంతో ప్రపంచంలోని సంగీతాభిమానుల్ని అలరిస్తున్నారు కె.జె.ఏసుదాస్ అలియాస్ జేసుదాస్. 60 ఏళ్లుగా తన గాన మాధుర్యాన్ని పంచుతున్న ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో అగస్టిన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించారు జేసుదాస్. ఆయన పూర్తి పేరు కట్టసేరి జోసెఫ్ ఏసుదాస్. తండ్రి అగస్టిన్ రంగస్థల నటుడుగా, భాగవతార్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి ప్రభావం జేసుదాస్‌పై బాగా ఉండేది. అందుకే సంగీతంపై మక్కువ పెంచుకొని చిన్నతనం నుంచే పాటలు పాడుతుండేవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ చేరుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, ఆయన గాత్రం సినిమా సంగీతానికి పనికి రాదని తిరస్కరించేవారు. అయితే వివిధ కార్యక్రమాల్లో వేదికపై పాటలు పాడుతుండేవారు. 17 ఏళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీత పోటీల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు జేసుదాస్. అతనిలోని సంగీతానికి మరిన్ని మెరుగులు అద్దేందుకు మ్యూజిక్ కాలేజీలో చేర్పించారు అగస్టిన్. అక్కడ కూడా తన ప్రతిభను చాటుకొని కళాశాలలో ప్రథమ స్థానం సంపాదించుకున్నారు. తనలోని సంగీతానికి మరింత పదును పెట్టుకునేందుకు కొందరు సంగీత విద్వాంసుల వద్ద మెళకువలు తెలుసుకున్నారు.
1961 నవంబర్ 14న జేసుదాస్ పాడిన మొదటి పాటను రికార్డ్ చేశారు. మలయాళ దర్శకుడు ఎల్.కె.ఆంటోని మొదటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు వరసగా అవకాశాలు వచ్చాయి. జేసుదాస్ గానంలోని మాధుర్యాన్ని అందరూ గుర్తించారు. శాస్త్రీయ సంగీతంలో ఆయన ప్రతిభకు మలయాళ చిత్ర రంగమే కాదు, భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలు ఆశ్చర్యపోయాయి. మాతృభాష మళయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలి, గుజరాతి, ఒడియా, మరాఠి, సంస్కృ తం, తుళు వంటి భారతీయ భాషల్లోనే కాదు మాలే, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్ వంటి విదేశీ భాష ల్లోనూ పాటలు పాడిన ఘనత కేవలం జేసుదాస్‌కే దక్కుతుంది. 60 సంవత్సరాలుగా తన గానంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
జేసుదాస్ క్రైస్తవ మతానికి చెందినవారైనా అయ్యప్ప స్వామితోపాటు ఆయన ఆలపించిన ఇతర భక్తి గీతాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారి పవళింపు సేవ సమయంలో జేసుదాస్ పాడిన ‘హరివరాసనం.. స్వామి విశ్వమోహనం..’ పాటను ప్రతి నిత్యం వినిపిస్తారంటే ఆయన గానంలో ఎంతటి భక్తిభావం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుడై ఉండి హిందూ భజనలు పాడుతున్నారని జేసుదాస్‌ను ఒక చర్చి వారు వెలివేశారు. అయితే సంగీతానికి భాష, మతం అడ్డు కాదని తర్వాతి రోజుల్లో గుర్తించిన ఆ చర్చి వారు మళ్ళీ ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు.
ఉత్తమ గాయకుడిగా ఇప్పటివరకు 8 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే అవార్డులు 40 సార్లు అందుకున్నారు జేసుదాస్. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. అలాగే కేంద్రపభుత్వం వివిధ సందర్భాల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు చేసిన సత్కారాలకు, అందించిన బిరుదులకు లెక్కే లేదు.
తమ దేశంలోని కొన్ని నగరాలలో కచేరీలు చేయాల్సిందిగా సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఆరోజుల్లో జేసుదాస్‌కి ఆహ్వానం పంపింది. అలాంటి ఘనత సాధించిన ఏకైక సంగీత కళాకారుడు జేసుదాస్. భారత దేశంలోని భాషలతోపాటు విదేశీ భాషల్లో దాదాపు 80,000 పాటలు పాడారు. ఇవి కాకుండా పలు భాషల్లోని భక్తి పాటలను కలిపితే ఆయన లక్షకుపైగా పాటలు పాడారు. ఇది ఒక ప్రపంచ రికార్డు అనే చెప్పాలి. 2006లో చెన్నయ్‌లోని ఎవిఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు భాషల్లో 16 పాటలు పాడి రికార్డు సృష్టించారు జేసుదాస్. 1970 ఫిబ్రవరి 1న ప్రభను వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం.. వినోద్, విజయ్, విశాల్. వీరిలో విజయ్.. విజయ్ ఏసుదాస్‌గా అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. తండ్రిని పోలిన స్వరంతో వివిధ భాషల్లో పాటు పాడుతూ అలరిస్తున్నారు విజయ్.
Also Read