ఉదయ్‌కిరణ్ పేరు మీద ఉన్న ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రాస్ చెయ్యలేదు!
on Jun 25, 2025
(జూన్ 26 ఉదయ్‌కిరణ్ జయంతి సందర్భంగా..)
సినీ పరిశ్రమలోని కళాకారుల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి స్టార్‌డమ్ వస్తుందో, ఎప్పుడు పరాజయాలు వెంటాడతాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది హీరోలకు ఎన్నో సినిమాలు చేసిన తర్వాతగానీ స్టార్‌డమ్ రాదు. మరికొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతారు. అలాంటి అరుదైన హీరో ఉదయ్‌కిరణ్. చాలా చిన్న వయసులోనే హీరోగా పరిచయమై, చిన్న వయసులోనే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్ సాధించి లవర్‌బోయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్‌కిరణ్ 33 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు ప్రేక్షకుల్ని కలచి వేసింది. హీరో అవ్వాలనే నిర్ణయం చిన్నతనంలోనే తీసుకున్న ఉదయ్.. దాన్ని సాధించేందుకు ఎలాంటి కృషి చేశారు? అతని చిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది? యూత్‌లో అంత ఫాలోయింగ్ ఎలా సంపాదించగలిగారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.
1980 జూన్ 26న వి.వి.కె.మూర్తి, నిర్మల దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు ఉదయ్‌కిరణ్. అతని విద్యాభాసం కూడా ఇక్కడే జరిగింది. తను పెద్దయ్యాక చిరంజీవి అంతటి హీరో అవుతానని చిన్నతనంలోనే తన అక్క శ్రీదేవితో చెప్పారు ఉదయ్. చిన్నప్పుడు అలాగే అంటారులే అని దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు అతని అక్క. కానీ, ఆ కోరిక పెద్దయ్యాక మరింత పెరిగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌కి వెళ్ళి కొన్ని చిన్న చిన్న యాడ్స్‌కి పనిచేశారు ఉదయ్. సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఉషాకిరణ్ మూవీస్ నిర్మిస్తున్న ‘చిత్రం’ సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులు కావాలని పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి రామోజీ ఫిలింసిటీకి వెళ్లారు. వందల మందిలో ఉదయ్‌ని సెలెక్ట్ చేశారు డైరెక్టర్ తేజ. తన సినిమాలో హీరో ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉదయ్‌ని తయారు చేశారు తేజ. 2000 జూన్ 16న ‘చిత్రం’ విడుదలై సంచలన విజయం సాధించింది. యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో ఒక లవ్‌స్టోరీతో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేశారు డైరెక్టర్ తేజ.
ఆ మరుసటి సంవత్సరం తేజ దర్శకత్వంలోనే ‘నువ్వు నేను’ చేశారు ఉదయ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయి యూత్ హీరోల్లో నెంబర్ వన్ అనిపించుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 21 ఏళ్ళ వయసులో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న హీరో అనే రికార్డు ఇప్పటికీ ఉదయ్‌కిరణ్ పేరుమీదే ఉంది. రెండు నెలల తేడాలోనే ‘మనసంతా నువ్వే’ చిత్రం కూడా విడుదలై ఘనవిజయం సాధించింది. అలా అతి చిన్న వయసులోనే హ్యాట్రిక్ సాధించిన హీరోగా ఉదయ్ పేరు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. 2002లో ‘నీ స్నేహం’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఉదయ్. ఈ సినిమాకి కూడా ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ నాలుగు సినిమాలకూ ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించడం విశేషం. మ్యూజికల్‌గా ఈ సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి.
ఉదయ్‌కిరణ్ 14 సంవత్సరాల కెరీర్‌లో 20 సినిమాల్లో నటించారు. వాటిలో మూడు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి నాలుగు సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. ఒక విధంగా ‘నీ స్నేహం’ ఉదయ్‌కిరణ్ కెరీర్‌లో చివరి హిట్ అని చెప్పాలి. ఆ తర్వాత రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేశారు. కానీ, విజయం మాత్రం అతని దరి చేరలేదు. 2003లో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలోనే వారిద్దరి వివాహం జరిపించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఉదయ్‌ని పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభం కావాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. 2012లో విషితను వివాహం చేసుకున్నారు ఉదయ్‌కిరణ్. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్‌ను చూసిన ఉదయ్ ఆ తర్వాత వచ్చిన పరాజయాలకు తట్టుకోలేకపోయారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.
2014 జనవరి 5న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్‌కిరణ్. అతని మరణవార్త విని ఇండస్ట్రీలోని ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అతని భౌతికకాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. వారిలో ఎంతో మంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఏ యూత్ హీరోకి లేనంత ఫాలోయింగ్ ఉదయ్‌కిరణ్‌కి ఉందనే విషయం అందరికీ తెలిసింది. 8 కిలోమీటర్ల దూరంలో వున్న స్మశాన వాటికకు ఉదయ్‌కిరణ్ బౌతికకాయం వెంట వేలమంది అభిమానులు నడుచుకుంటూ వెళ్లారు. అంతేకాదు, విజయనగరంలో ఉంటున్న ఓ అభిమాని ఉదయ్‌కిరణ్ మరణాన్ని తట్టుకోలేక తను కూడా ఓ చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
