ENGLISH | TELUGU  

తండ్రి చనిపోయిన తర్వాత ఆయన డైరీ చదివి షాక్ అయిన కె.విశ్వనాథ్‌!

on Feb 19, 2025

(ఫిబ్రవరి 19 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జయంతి సందర్భంగా..)

మన సంస్కృతీ సాంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు రూపొందించడం ద్వారా దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. తన సినిమాల ద్వారా ప్రజలకు కళల పట్ల మక్కువ ఏర్పడేందుకు చేసిన కృషి అద్వితీయం అని చెప్పాలి. సినిమాల్లోకి రావడం, దర్శకుడు కావడం అనేది విశ్వనాథ్‌ ముందుగా డిజైన్‌ చేసుకున్నది కాదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం ఆయన వదులుకోలేదు. బిఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్న విశ్వనాథ్‌ని ఆయన తండ్రి వాహిని స్టూడియోలో సౌండ్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ చేశారు. అక్కడ పని నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత సౌండ్‌ ఇంజనీర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. విశ్వనాథ్‌లోని ప్రతిభను మొదట గుర్తించిన వారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. సినిమాలపై విశ్వనాథ్‌ చేస్తున్న విశ్లేషణ నచ్చడంతో తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్చుకున్నారు. ఆయన దగ్గర ఎన్నో సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశారు విశ్వనాథ్‌. ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌లో రూపొందిన మొదటి సినిమా ఆత్మగౌరవం. ఈ సినిమా తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. వాటిలో సుడిగుండాలు, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి వంటి సినిమాలు ఉన్నాయి. 

1976లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రంతో తన పంథా మార్చుకున్నారు విశ్వనాథ్‌. కళలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటి పట్ల వారికి ఆసక్తిని కలిగించాలని అనుకున్నారు.  తెలుగులో ఘనవిజయం సాధించిన సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో సర్గమ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విశ్వనాథ్‌ రూపొందించిన మరో మంచి సినిమా సీతామాలక్ష్మి. 1980 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. శంకరాభరణం వంటి కళాఖండం విడుదలై ఆయన కీర్తి విశ్వవ్యాప్తం కావడానికి కారణమైన సంవత్సరం. ఆ సినిమాకి లభించిన ఆదరణ అసామాన్యమని చెప్పాలి. ఆ తర్వాత సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి అద్భుతమైన సినిమాలను తీర్చిదిద్దారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శుభప్రదం. 

కె.విశ్వనాథ్‌ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకి జోతిష్యం హాబీగా ఉండేది. కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి చెప్పేవారు కాదు. కానీ, విశ్వనాథ్‌ మాత్రం ఏనాడూ జోతిష్యం, జాతకాల జోలికి వెళ్లలేదు. వాటిని మూఢంగా నమ్మేవారు కాదు. కాకపోతే మంచిరోజులు కాదు అని చెప్పుకునే అష్టమి, నవమి రోజుల్లో మంచికార్యాలు మొదలు పెట్టేవారు కాదు. మంచి రోజులు, మంచి ఘడియలు కాని సమయంలో కూడా రైళ్లు, విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే అందరికీ చెడు జరగాలని లేదు. కాకపోతే మనకు జరిగే చెడుని తప్పించే వీలు వున్నప్పుడు మంచి రోజుల్లోనే కొన్ని పనులు మొదలు పెట్టాలని మాత్రం అనుకునేవారు. ఆయన ఎదుగుదలను చూసి తండ్రి సుబ్రహ్మణ్యం లోలోపలే సంతోషించేవారు తప్ప ఏనాడూ విశ్వనాథ్‌ని పొగడలేదు. అంతేకాదు, ఆయన చేసే సినిమాలకు సంబంధించి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ముఖ్యంగా సినిమాలకు ముహూర్తాలు పెట్టడం కానీ, వాటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలు కానీ విశ్వనాథ్‌తో చర్చించేవారు కాదు. 

తండ్రి చనిపోయిన తర్వాత ఒకరోజు ఆయన రాసుకున్న డైరీలను పరిశీలించారు విశ్వనాథ్‌. తనతో ఏనాడూ చెప్పని విషయాలు ఆయన అందులో రాసుకున్నారు. తన కెరీర్‌లో సాధించిన విజయాలకు సంబంధించి కొన్ని లెక్కలు కనిపించాయి. సరిగ్గా ఆయన రాసినట్టే జరిగిందని విశ్వనాథ్‌ తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయన డైరీలో శంకరాభరణం చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా కొన్నేళ్ళపాటు తెలుగువారు గుర్తు పెట్టుకుంటారు. చలనచిత్ర సీమలో శంకరాభరణం చరిత్ర సృష్టిస్తుందని రాసుకున్నారు. అలాగే ఆ సినిమా ప్రభావం విశ్వనాథ్‌పై బలంగా ఉంటుందని కూడా అందులో ఉంది. ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని కూడా ఆయన అందులో రాశారు. విశ్వనాథ్‌ సినీ జీవితానికి సంబంధించి ఆయన తండ్రి రాసిన విషయాలన్నీ అక్షర సత్యాలుగా కళ్ళముందు కనిపించడంతో విస్తుపోయారు విశ్వనాథ్‌. అందుకే తనకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నీ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే వచ్చాయని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చెప్పేవారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.