(మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా..)
దర్శకుడిగానే కాదు, మాటల రచయితగా దాసరి నారాయణరావుకు ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా సినిమాలకు మాటలు రాసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన మాటలు రాసే విధానం చూసి నిర్మాత కె.రాఘవకు దాసరిపై మంచి నమ్మకం ఏర్పడింది. తన బేనర్‌లోనే అతన్ని డైరెక్టర్‌గా పరిచయం చెయ్యాలనుకున్నారు. ఒక మంచి కథ రెడీ చేసుకొని వస్తే అవకాశం ఇస్తానని చెప్పారు. రాఘవ చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత ఒక కథతో వచ్చారు దాసరి.
ఆరోజుల్లో ఒక సినిమా ప్రారంభం కావాలంటే పంపిణీదారుల పాత్ర ఎక్కువగా ఉండేది. నిర్మాతలు తప్పనిసరిగా వారిని కలవాల్సి వచ్చేది. ఎందుకంటే నిర్మాణానికి కొంత పెట్టుబడి పంపిణీదారులు కూడా పెట్టేవారు. మొదట వారికి కథ నచ్చాలి. అలాగే అందులో నటించే నటీనటుల గురించి కూడా చెప్పాలి. అన్నీ ఓకే అనుకుంటే దఫ దఫాలుగా నిర్మాతకు డబ్బు పంపేవారు. తాము అనుకున్న కథతో ఒక పంపిణీదారుడు దగ్గరకు వెళ్లారు దాసరి, రాఘవ.
కథ విన్న ఆ పంపిణీదారుడు.. బాగానే ఉంది కానీ ఎవరైనా పెద్ద డైరెక్టర్ చేస్తే బాగుంటుంది. కొత్త డైరెక్టర్‌తో ఎందుకు రిస్క్ అన్నారు. కానీ, రాఘవ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాసరిని డైరెక్టర్‌ని చెయ్యడం కోసం ఎంతమంది దగ్గరికి అయినా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే అందరు డిస్ట్రిబ్యూటర్లు అదే మాట చెప్పారు. చివరికి ఒక డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడి పెట్టేందుకు ఒప్ప్పుకున్నారు. అలా దాసరి నారాయణరావు మొదటి సినిమా ‘తాత మనవడు’ ప్రారంభమైంది. ఈ సినిమాలో రాజబాబు చేసిన క్యారెక్టర్‌ను శోభన్‌బాబుతో చేయించాలనుకున్నారు రాఘవ. కానీ, రాజబాబు అయితేనే బాగుంటుందని దాసరి చెప్పడంతో అతనితోనే చేశారు.
తొలి సినిమాతోనే డైరెక్టర్‌గా తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు దాసరి. సినిమాలో ఆయన రాసిన డైలాగులకు ఎంత పేరు వచ్చిందంటే.. ఆరోజుల్లో ప్రముఖ రచయితగా ఎన్నో అద్భుతమైన సినిమాలకు అర్థవంతమైన మాటలు, పాటలు రాసిన ఆత్రేయ వంటి వారు దాసరిని భుజం తట్టి అభినందించారు. సినిమాలో ఒక సందర్భంలో ఎస్.వి.రంగారావు చెప్పే డైలాగు ‘ప్రపంచంలో కావాల్సినవాళ్లు కోట్ల కొద్దీ ఉండొచ్చు. కానీ, ఆఖరికి మోసుకుపోవడానికి నలుగురు కావాలిగా. అందుకే అన్నారు పెద్దలు నలుగురితో మంచిగా ఉండరా అని. ఎందుకు. ఆఖరికి కాటికి మోసుకుపోవడానికి ఆ నలుగురైనా మిగులుతారని’ ఈ డైలాగుకు థియేటర్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి.
‘తాత మనవడు’ రిలీజ్ అయిన తర్వాత సినిమాలోని ఈ డైలాగ్ విని ఆత్రేయ మురిసిపోయారట. దాసరి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆయన్ని కలిసి అభినందించారు. ఇలాంటి డైలాగులు తను తప్ప మరొకరు రాయలేరు అనుకునేవారట ఆయన. తన తర్వాత అలాంటి డైలాగులు రాయగల రైటర్ దాసరి అంటూ బహిరంగంగానే మెచ్చుకున్నారు ఆత్రేయ. ఆ తర్వాతి కాలంలో తాత మనవడు తరహాలో ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో అద్భుతమైన డైలాగులు రాసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు దాసరి.




