నటుడిగా గుమ్మడిని ఎంతో ప్రోత్సహించిన ఎన్టీఆర్.. ఐదేళ్లు ఎందుకు దూరం పెట్టారు?
on Jan 27, 2026
(జనవరి 27 గుమ్మడి వెంకటేశ్వరరావు వర్థంతి సందర్భంగా..)
సినిమా రంగంపై వున్న ఆసక్తితో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చిన గుమ్మడి వెంకటేశ్వరరావు.. తొలిసారి నటించిన సినిమా 1950లో వచ్చిన అదష్టదీపుడు. ఈ సినిమా తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో సినిమా రాలేదు. విసిగిపోయిన గుమ్మడి మద్రాస్ వదిలి ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్‌తో గుమ్మడికి మంచి స్నేహం ఉంది. దాంతో తను వెళ్లిపోతున్న విషయం చెప్పడానికి ఆయన్ని కలిశారు. అయితే ఎన్టీఆర్ దానికి ఒప్ప్పుకోలేదు. త్వరలోనే తను సొంత నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నానని, తమ సినిమాల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు ఎన్టీఆర్.
ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్ థియేటర్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్. మాట ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో గుమ్మడికి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం ‘తోడు దొంగలు’ చిత్రాన్ని నిర్మించారు. అందులో ఎన్టీఆర్‌కు సమానమైన పాత్ర ఇచ్చి గుమ్మడిని ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఎన్.ఎ.టి. సంస్థకు ఎంతో పేరు, డబ్బు తెచ్చి పెట్టిన ‘జయసింహ’ చిత్రంలోనూ గుమ్మడికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత గుమ్మడి కెరీర్ ఊపందుకుంది.
వరసగా సినిమాలు చేస్తూ గుమ్మడి బిజీ అయిపోయారు. అదే సమయంలో బయటి సంస్థ నిర్మిస్తున్న ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో టైటిల్ పాత్ర చేసే అవకాశం కల్పించారు ఎన్టీఆర్. అలా తమ సంస్థలోనే కాకుండా బయటి సంస్థలో కూడా సినిమాలు ఇప్పించేవారు. అంతటి అనుబంధం ఉన్న గుమ్మడిని ఒక దశలో ఐదేళ్ళపాటు దూరం పెట్టారు. ఇద్దరికీ మాటలు లేవు. ఎన్టీఆర్‌ను కలవాలని గుమ్మడి ప్రయత్నించినా ఆ అవకాశం ఇవ్వలేదు ఎన్టీఆర్. ఇద్దరి మధ్య అంత దూరం పెరగడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
అప్పటికి టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ విషయం అయినా ఇద్దరూ చర్చించుకునేవారు. అదే సమయంలో ఎఎన్నార్ మద్రాస్ వదిలి హైదరాబాద్ వచ్చేశారు. తనతో సినిమాలు చెయ్యాలనుకునేవారు హైదరాబాద్ రావాలని చెప్పారు. ఎన్టీఆర్ చేసే సినిమాలు అందులోని క్యారెక్టర్స్ దష్ట్యా ఆయనతో ఎక్కువగా ఎస్వీఆర్ నటించేవారు. అక్కినేని సినిమాల్లో ఎక్కువగా గుమ్మడి కనిపించేవారు. దాంతో నెలలో 20 రోజులు హైదరాబాద్‌లోనే ఉండేవారు గుమ్మడి.
చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలి రావడం ఎన్టీఆర్‌కు ఇష్టం లేదు అనే ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్, ఎఎన్నార్ మధ్య దూరం పెంచేందుకు కొంతమంది కావాలని ఉన్నవి, లేనివి వారికి చెప్పేవారు. ఆ విధంగా ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగేవి. తను విన్నదాన్ని బట్టి తనపై హైదరాబాద్‌లో కుట్ర జరుగుతోందని భావించారు ఎన్టీఆర్. తనకు ఎంతో ఆప్తుడు అనుకున్న గుమ్మడి నెలలో 20 రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నప్పటికీ ఆ విషయాలు తనకు చెప్పకపోవడం ఎన్టీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. దాంతో గుమ్మడిని దూరం పెట్టడం ప్రారంభించారు. ఆయనతో మాట్లాడడం కూడా మానేశారు. అంతేకాదు, గుమ్మడి ఇంట్లో జరిగిన శుభకార్యాలకు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు.
తనకు సంబంధం లేని విషయంలో ఎన్టీఆర్ తనను దోషిగా చూస్తున్నారని, వారిద్దరి మధ్య తను నలిగిపోతున్నానని గ్రహించిన గుమ్మడి.. ఎన్టీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు. అలా ఐదేళ్లపాటు వారి మధ్య దూరం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నిజం తెలుసుకున్న ఎన్టీఆర్.. మళ్ళీ గుమ్మడిని చేరదీశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



