పాతతరం హీరోల్లో ఎన్టీఆర్, ఎఎన్నార్ ఒకే సమయంలో స్టార్ హీరోలుగా కొనసాగారు. అయినా ఇద్దరూ కలిసి నటించేందుకు ఏ సందర్భంలోనూ ఇబ్బంది పడలేదు. ఇద్దరూ అన్నదమ్ములుగా మసలుకొనేవారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు కూడా వారిలాగే తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలా వారిద్దరూ కలిసి చేసిన ఓ మంచి సినిమా ‘మంచి మిత్రులు’.
కృష్ణ కెరీర్ ప్రారంభంలో నిర్మాత మల్లిఖార్జునరావు ఎంతో ప్రోత్సహించారు. కృష్ణతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాయే ‘మంచి మిత్రులు’. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఇద్దరు మిత్రుల కథ ఇది. అభిప్రాయ భేదాల వల్ల ఒక సందర్భంలో ఇద్దరూ విడిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఒకరు దొంగగా, ఒకరు పోలీస్ ఆఫీసర్‌గా మారతారు.
ఇద్దరూ కలుసుకోవాల్సిన రోజు వస్తుంది. ఆ సమయంలో వచ్చే పాట ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’. ఈ పాటను ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యంలతో పాడించాలనుకున్నారు కోదండపాణి. అయితే ఎవరికి ఎవరు పాడాలి అనే విషయంలో పెద్ద చర్చ జరిగింది. కృష్ణకు ఘంటసాల, శోభన్‌బాబుకి బాలసుబ్రహ్మణ్యంతో పాడిస్తే బాగుంటుందని దర్శకుడు, సంగీత దర్శకుడు అనుకున్నారు. అప్పటికి బాలసుబ్రహ్మణ్యం కొత్త సింగర్. ఘంటసాల పాడితేనే తనకు బాగుంటుందని కృష్ణ, శోభన్‌బాబు ఇద్దరూ అనుకున్నారు.
చివరికి దర్శకనిర్మాతలు, సంగీత దర్శకుడు అనుకున్నట్టుగానే కృష్ణకు ఘంటసాల, శోభన్‌బాబుకి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ విషయంలో శోభన్‌బాబు కాస్త నిరాశ చెందారు. తన వెర్షన్‌కి ఘంటసాలతోనే పాడించుకోవాలని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ, కుదరలేదు. ఎట్టకేలకు పాట రికార్డ్ అయింది. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. సినిమాలో అదే హైలైట్‌గా నిలిచింది. ఆరోజుల్లో రేడియోలో ఈ పాట మారుమోగిపోయింది. ఆ పాట వింటుంటే ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. పాట విషయంలో కృష్ణ, శోభన్‌బాబు పోటీ పడినప్పటికీ అది వారి స్నేహానికి ఎలాంటి ఆటంకాన్ని కలిగించలేదు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.





