1978లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ ఒకటి.
1981లో ఈ సినిమా విడుదలైంది. అప్పటికే చిరంజీవి 35 సినిమాల్లో నటించారు. హీరోగా ఆయనకు ఒక రేంజ్‌ని తీసుకొచ్చిన సినిమా ‘చట్టానికి కళ్లులేవు’. ఈ సినిమా ఘనవిజయం సాధించి చిరంజీవికి మాస్ హీరోగా మంచి పేరు తెచ్చింది.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ సినిమా విడుదలై 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ థియేటర్‌లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే. దాంతో శతదినోత్సవాన్ని ఈ థియేటర్‌లోనే నిర్వహించారు.
ఈ వేడుకకు శోభన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంలో శోభన్‌బాబు మాట్లాడుతూ నేను నటుడిగా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ టాప్ హీరోలుగా ఉన్నారు. ఇక రాబోయే రోజులన్నీ చిరంజీవివే అన్నారు.
శోభన్‌బాబు చెప్పినట్టుగానే టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరోగా చక్రం తిప్పి మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే.




