ఇళయరాజా వల్లే ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.. ఎలాగంటే?
on Jan 5, 2026
(జనవరి 6 ఎ.ఆర్.రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా..)
- రెహమాన్‌ను ఇళయరాజా ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు?
- ఇళయరాజా, రెహమాన్ మధ్య గొడవకు కారణమైన సినిమా ఏది?
- మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్ బ్రేక్ అవ్వడానికి కారణం ఎవరు?
సంగీతాన్ని ఆస్వాదించనివారు ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన సంగీతాన్ని వింటూ సేద తీరుతుంటారు. సినిమా అనేది మొదలైన తర్వాత ఆ సంగీతానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటల పాత్ర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. వందేళ్లు పైబడిన ఇండియన్ సినిమాల్లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సంగీతంతో అలరించారు. దక్షిణ భారత చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎంతో మంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పటికీ మర్చిపోలేని పాటల్ని అందించారు.
సినీ సంగీతంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వారిలో ఇళయరాజాను ప్రధానంగా చెప్పుకోవాలి. అప్పటివరకు వస్తున్న సంగీతానికి భిన్నమైన సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేశారు ఇళయరాజా. శ్రోతలకు వీనుల విందైన సంగీతాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారు. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో సౌత్ ఇండియన్ సినిమా సంగీతాన్ని శాసించిన ఇళయరాజా.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన తర్వాత అంతటి ప్రభావాన్ని వేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని ఇళయరాజాను సైతం పక్కన పెట్టే స్థాయికి వెళ్లిపోయాడు.
ఎ.ఆర్.రెహమాన్ అనే సంగీత దర్శకుడు పరిచయం కావడం వెనుక ఇళయరాజా హస్తం ఉందనే విషయం చాలా మందికి తెలీదు. ఒక విధంగా అతని కాంపౌండ్ నుంచి వచ్చినవాడే రెహమాన్. సంగీత దర్శకుడు కాక మునుపు కమర్షియల్స్‌కు జింగిల్స్, స్టేజ్ షోలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఇళయరాజా దగ్గర ప్రోగ్రామర్‌గా జాయిన్ అయ్యాడు. ఎన్నో సినిమాలకు ఇళయారాజా దగ్గర పనిచేశాడు. అలా ఆయన దగ్గర నుంచి సినిమా సంగీతానికి సంబంధించిన ఎన్నో మెళకువలు తెలుసుకున్నాడు.
నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయంలో హర్ట్ అయిన ఇళయరాజా.. రెహమాన్‌ను తన స్టూడియో నుంచి ఇంటికి పంపించేశారు. డైరెక్టర్ మణిరత్నం సమక్షంలోనే ‘జల్లంత కవ్వింత కావాలిలే..’ అనే పాటను కంపోజ్ చేస్తున్నారు ఇళయరాజా. ఆ పాట నడకలో కొన్ని మార్పులను తన అభిప్రాయంగా చెప్పాడు రెహమాన్. అది ఇళయరాజాకు నచ్చలేదు. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ సమయంలో రెహమాన్ చేసిన సూచనలు మణిరత్నంకు బాగా నచ్చాయి.
ఇది జరిగిన కొన్నాళ్లకు తమిళ దర్శకుడు కె.బాలచందర్ తన సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రం చెయ్యాలనుకున్నారు. అప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ ఇళయారాజాయే సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యే నాటికి లండన్‌లో సింఫనీ చేసే పనిలో ఉన్నారు ఇళయరాజా. అప్పుడు మణిరత్నం మనసులో రెహమాన్ కదిలాడు. ఇదే విషయాన్ని కె.బాలచందర్‌కి చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించి ఒక పాటకు ట్యూన్ చెయ్యమన్నారు. అలా రెహమాన్ మొదట ట్యూన్ చేసిన పాట ‘చిన్ని చిన్ని ఆశ..’. ఈ ఈ ట్యూన్ మణిరత్నంకి, బాలచందర్‌కి బాగా నచ్చింది. అలా ‘రోజా’ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను రెహమాన్‌కి అప్పగించారు.
‘రోజా’ సినిమాతో మొదలైన మణిరత్నం, రెహమాన్‌ల సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 19 సినిమాలు వచ్చాయి. అంతకుముందు ఇళయరాజా కాంబినేషన్‌లో 10 సినిమాలు చేశారు మణిరత్నం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా దళపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇళయరాజాతో కలిసి సినిమా చెయ్యలేదు మణిరత్నం. అప్పటి నుంచి రెహమాన్‌తోనే కొనసాగుతున్నారు. తన కెరీర్‌లో 29 సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో మాత్రమే మ్యూజిక్ చేయించుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



